
FIR: దేశ రాజధానిలో నమోదైన తొలి ఎఫ్‌ఐఆర్‌లో ఏముంది?
దిల్లీ: ఏ నేరం జరిగినా బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. కానీ, మీ నగరం/ ఊరి పోలీస్ స్టేషన్‌లో నమోదైన తొలి ఎఫ్‌ఐఆర్ ఏదై ఉంటుంది? ఏ నేరం గురించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉంటారు? ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా? మీరున్న ప్రాంతంలో ఏమోగానీ.. దేశ రాజధాని దిల్లీ నగరంలో నమోదైన తొలి ఎఫ్‌ఐఆర్ తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
160 ఏళ్ల కిందట దిల్లీలో తొలి ఎఫ్‌ఐఆర్ నమోదైందట. 1861 అక్టోబర్ 18న కత్ర సుశీల్ మహల్ ప్రాంతానికి చెందిన మొయిద్దీన్ S/O మహ్మద్ యార్ ఖాన్ తన ఇంట్లో 45 అణాలు (దాదాపు. రూ.2.81) విలువ చేసే వస్తువులు పోయినట్లు సబ్జీ మండీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వంట పాత్రలు, హుక్కా (ధూమపానం చేసేందుకు ఉపయోగించే పైపు), కుల్ఫీ ఐస్‌క్రీం చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు తొలి ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఉర్దూలో నమోదు చేసిన ఈ ఎఫ్‌ఐఆర్‌ను నిజానికి ఉత్తర దిల్లీ పోలీసులు ఫ్రేమ్ కట్టించి.. దిల్లీ పోలీస్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. తాజాగా ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ స్పెషల్ డైరెక్టర్ యశోవర్ధన్ అజాద్ ఆ ఎఫ్‌ఐఆర్‌ను ఫొటో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయగా.. ‘ఇంతకీ దొంగలు దొరికారా?, పోయిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారా?’, ‘నిజంగా అవి ఎంతో విలువైన గుర్తులు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గతంలోనూ దిల్లీ పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్ గురించి వివరిస్తూ పలు పోస్టులు పెట్టారు.
160 ఏళ్ల కిందట దిల్లీలో సబ్జీ మండీతోపాటు ముండ్కా, మెరౌలీ, కొత్వాలి, సర్దార్ బజార్ మొత్తం ఐదు పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉండేవట. ఇప్పటికీ సబ్జీ మండీ పోలీస్ స్టేషన్‌కు సంబంధించి పురాతన ఎఫ్‌ఐఆర్‌లు కొన్ని ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. 2 అణాలు విలువ చేసే 11 బత్తాయి పండ్ల దొంగతనానికి సంబంధించి 1895 ఏప్రిల్ 30న, 5 అణాలు విలువ చేసే దుస్తుల చోరీకి సంబంధించిన 1897 మార్చి 15న నమోదైన ఎఫ్ఐఆర్‌లు కూడా భద్రపర్చినట్లు పోలీసులు వెల్లడించారు.