దిల్లీలో ఆగని ఆందోళనలు..

ఈశాన్య దిల్లీలో సోమవారం చెలరేగిన అల్లర్లు మంగళవారం తెల్లవారుజాము వరకు కొనసాగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.........

Updated : 25 Feb 2020 12:30 IST

దిల్ల్లీ: ఈశాన్య దిల్లీలో సోమవారం చెలరేగిన అల్లర్లు మంగళవారం తెల్లవారుజాము వరకు కొనసాగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. మృతుల్లో హెడ్‌కానిస్టేబుల్‌  కూడా ఉన్నారు. తెల్లవారుజాము వరకు ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారని.. అర్ధరాత్రి వేళ ఓ అగ్నిమాపక యంత్రానికి నిప్పుపెట్టారని తెలిపారు. మంటల్ని అదుపు చేయడానికి వచ్చిన మరిన్ని అగ్నిమాపక యంత్రాలపై నిరసకారులు రాళ్లు రువ్వారు. ఈ  ఘటనలో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం మౌజ్‌పూర్‌, బ్రహ్మపురి ప్రాంతంలో ఆందోళనకారులు రాళ్లురువ్వినట్లు సమాచారం. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఫ్లాగ్‌ మార్చ్ నిర్వహించారు. మొత్తం 150 మందికి పైగా గాయాలతో గురు తేజ్‌ బహదూర్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఆందోళనకారుల్లో కొంతమంది తుపాకులు ఎక్కుపెట్టి ఉన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఈశాన్య దిల్లీ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు. భారీ స్థాయిలో పోలీసు బలగాల్ని మోహరించారు. పరిస్థితిపై హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఉదయం ఈశాన్య దిల్లీ ప్రాంత అధికారులు, ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. 

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక ఉద్యమాలతో సోమవారం ఈశాన్య దిల్లీ దద్దరిల్లిన విషయం తెలిసిందే. నిరసనకారులు ఆస్తులకు నిప్పు పెట్టారు. పెట్రోల్‌ బంకు సహా ఇళ్లు, వాహనాలను ధ్వంసం చేశారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని