ఎన్నికల తర్వాతే వద్దామనుకున్నా.. కానీ: ట్రంప్‌

రాష్ట్రపతి భవన్‌లో విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాతే భారత పర్యటనకు రావాలనుకున్నానని...........

Published : 26 Feb 2020 10:31 IST

దిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాతే భారత పర్యటనకు రావాలనుకున్నానని.. కానీ, మోదీకి తన ఆలోచన నచ్చలేదని చెప్పారు. అందుకే ఇప్పుడే వచ్చేశానని తెలిపారు. ‘‘ నేను ప్రధాని మోదీకి కాల్‌ చేసి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత వస్తే మీకేమైనా అభ్యంతరమా అని అడిగాను. ఆయన నా ఆలోచనను ఇష్టపడలేదు’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి భవన్‌లో విందు ఆరగించే ముందు మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల భారత పర్యటన అద్భుతంగా సాగిందన్నారు. విమానంలో ప్రయాణించిన 18 గంటల సమయాన్ని తాను లెక్కగట్టడం లేదన్నారు. ఎందుకంటే తనకు ఇష్టమైన ప్రాంతానికి రాబోతున్న ప్రయాణ సమయం తనకు భారంగా అనిపించలేదని వ్యాఖ్యానించారు. 

భారత్‌ను, ఇక్కడి ప్రజలను తాను ఎంతగానో ప్రేమిస్తానని ట్రంప్‌ పునరుద్ఘాటించారు. గత ఏడాది టెక్సాస్‌లో జరిగిన ‘హౌడీ-మోదీ’ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అమెరికా ప్రజలు ఇంకా ఆ సభ గురించి మాట్లాడుకుంటున్నారని తెలిపారు. మోతెరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్‌’ సభ అత్యద్భుతంగా సాగిందన్నారు. లక్షా 25 వేల మంది హాజరుకావడం మరచిపోలేని అనుభూతినిచ్చిందన్నారు. ఇంకా వేలాది మంది స్టేడియం వెలుపల వేచి చూసినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. రోడ్డుకిరువైపులా వేలాది మంది ప్రజలు తనకు స్వాగతం పలికిన తీరు తనను అబ్బుపరిచిందన్నారు. చివరిసారిగా మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మరోసారి తప్పకుండా భారత్‌కు వస్తాం.. మిమ్మల్ని అందరినీ మిస్‌ అవుతున్నాం’’ అంటూ భారత్‌ పర్యటనను ముగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని