విభేదాల్లేవ్‌... కలసి పనిచేస్తాం...

కొవిడ్‌-19 నిబంధనల అమలును పరిశీలించేందుకు కేంద్ర బృందం పశ్చిమ బెంగాల్‌ పరిశీలనకు రావటంతో కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజుకున్న వివాదం సద్దుమణిగింది.

Updated : 22 Apr 2020 22:20 IST

కోల్‌కతా: కొవిడ్‌-19 నిబంధనల అమలును పరిశీలించేందుకు కేంద్ర బృందం పశ్చిమ బెంగాల్‌ పరిశీలనకు రావటంతో కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజుకున్న వివాదం సద్దుమణిగింది. తాము కేంద్రానికి కరోనా వైరస్‌ కట్టడి విషయంలో పూర్తి మద్దతు తెలుపుతామని ఆ రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ లిఖితపూర్వకంగా వివరించటంతో ఈ అంశానికి తెరపడింది. వివరాలు ఇలా ఉన్నాయి...

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలును పరిశీలించటానికి కేంద్రం పశ్చిమ బెంగాల్‌కు పరిశీలక బృందాలను పంపింది. అయితే ఇది రుచించని బెంగాల్‌ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఆటంకం కలిగించిందంటూ హోం సెక్రటరీ అజయ్‌ భల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై హోం సెక్రటరీ, ఛీఫ్ సెక్రటరీ రాజీవ్‌ సిన్హాల మధ్య లేఖాస్తాలు నడిచాయి. తనకు అధికారికంగా సమాచారం ఇవ్వక ముందుగానే కేంద్ర బృందాలు విచ్చేయటంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని మోదీకి ఓ ఘాటు లేఖ రాయటంతో ఈ వివాదం తారస్థాయికి చేరుకుంది. అంతేకాకుండా తమ రాష్ట్రానికి కేంద్ర పరిశీలన బృందం రావటంలోని ఆంతర్యాన్ని ఆమె ప్రశ్నించారు. 
అయితే పర్యటనకు ముందురోజు ఛీప్‌ సెక్రటరీతో సమావేశమైనప్పటికీ కేంద్రబృందం కోల్‌కతాలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చిందని... పరిశీలనకు వెళ్లేందుకు ఆటంకాలున్నాయంటూ రాష్ట్రం పేర్కొనటం పట్ల హోం సెక్రటరీ అజయ్‌ భల్లా అసహనం వ్యక్తం చేశారు. బృంద సభ్యుల పర్యటనకు, వైద్య సిబ్బందితో సమావేశం కావటానికి, తద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితిని గురించి అంచనా వేసేందుకు ఆటంకం కలిగిందని అజయ్‌ భల్లా తన లేఖలో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రలకు కూడా ఇదేవిధంగా నోటీసు పంపామని... ఆయా రాష్ట్రాలు చాలా సహకరించాయని మరి వారికి లేని సమస్య పశ్చిమ బెంగాల్‌కు ఎందుకు తలెత్తిందో తెలియలేదని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, రాష్ట్రాలు కేంద్రానికి తప్పనిసరిగా సహకరించాలని లేకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హోంసెక్రటరీ భల్లా హెచ్చరించారు. 
దీనికి రాష్ట్ర సెక్రటరీ రాజీవ్‌ సిన్హా జవాబిస్తూ... సహాయ నిరాకరణ వంటిదేమీ లేదని, ముందస్తు సమాచారం లేకుండా కేంద్రబృందం రావటంతో, గణాంకాలతో కూడిన సమాచారాన్ని అందించటానికి అవకాశం లేకపోయిందని ఆయన తెలిపారు. కేంద్ర బృందం తమ సహకారాన్ని కోరలేదని కూడా ఆయన వివరించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అమలుకు తాము హామీ ఇస్తున్నట్టు కూడా ఆయన తెలియచేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని