20 కంపెనీల కేంద్ర బలగాలను మాకు పంపరూ!

కరోనా మహమ్మారి ధాటికి మహారాష్ట్ర విలవిలలాడుతోంది. దేశంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు అక్కడే నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి.......

Updated : 13 May 2020 19:44 IST

కేంద్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన

ముంబయి: కరోనా మహమ్మారి ధాటికి మహారాష్ట్ర విలవిలలాడుతోంది. దేశంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు అక్కడే నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 22 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే, సెలవుల్లేకుండా రాత్రింబవళ్లు పనిచేసిన సిబ్బందికి కాస్త విశ్రాంతి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 2000 మంది (20 కంపెనీలు) కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్‌) తమ రాష్ట్రానికి పంపాలని  కేంద్రాన్ని అభ్యర్థించింది.

ఈ అంశంపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా రాష్ట్ర పోలీసులు లాక్‌డౌన్‌ను అమలు చేయడంలో భాగంగా రాత్రింబవళ్లు అవిశ్రాంతంగా పనిచేశారు. ఇప్పుడు రంజాన్‌ పర్వదినం సమీపిస్తోంది. దీంతో శాంతి భద్రతలను సమర్థంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. లాక్‌డౌన్‌లో విధులు నిర్వహించిన ఇక్కడి పోలీసులకు కొంత విశ్రాంతి అవసరం. అందుకే 20 కంపెనీల కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరాం’’ అని వివరించారు. 

మహారాష్ట్రలో చాలామంది ప్రముఖులు తమ సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్‌ చిత్రంగా పోలీసుల లోగోను పెట్టుకొని వారి పట్ల తమ కృతజ్ఞతను చాటుకుంటున్నారు. రాష్ట్రంలో దాదాపు వెయ్యి మందికి పైగా పోలీసు సిబ్బంది కరోనా బారిన పడగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, మహారాష్ట్రలో ఇప్పటివరకు 24,427 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా 921మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని