
కార్మిక చట్టాల్లో సవరణలపై సుప్రీంలో వ్యాజ్యం
దిల్లీ: కార్మిక చట్టాల సవరణలపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కార్మిక చట్టాల నుంచి పరిశ్రమలకు మినహాయింపులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ పంకజ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఈ వ్యాజ్యం వేశారు. ఫ్యాక్టరీల చట్టం, 1948లోని సెక్షన్ 5ను వినియోగించడం తప్పుడు నిర్ణయమని, వెంటనే ఆయా రాష్ట్రాలు ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేయాలని పిటిషన్ కోరారు.
కార్మిక సంక్షేమ చట్టాల నుంచి పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా పరిశ్రమలకు కార్మికుల పని గంటలను పెంచుకోవడానికి వీలు కలుగుతోందని పిటిషనర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రోజువారీ పనివేళలను 8 నుంచి 12 గంటలకు, వారం పని వేళలను 48 నుంచి 72 గంటలకు పెంచుకునే విధంగా ఏప్రిల్ 17న గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఉదహరించారు. దీనివల్ల కేవలం 12 గంటల పాటు పనిచేసేందుకు ముందుకొచ్చే కార్మికులను మాత్రమే పరిశ్రమలు పనిలోకి తీసుకుంటాయన్నారు.
దీనివల్ల కార్మికులు కోర్టులను ఆశ్రయించే హక్కు కోల్పోతారని పిటిషన్ పేర్కొన్నారు. ఓ విధంగా ఇది రాజ్యాంగంలోని సమానత్వం, జీవించే హక్కును కాలరాయడమేనని పేర్కొన్నారు. కేవలం పబ్లిక్ ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్ 5ను వినియోగించాల్సి ఉంటుందన్నారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయిన ఈ పరిస్థితుల్లో వారి సంక్షేమానికి ఉద్దేశించిన చట్టాలను ఉపసంహరించడం వల్ల వారు మరింత దోపిడీకి గురౌతారని పేర్కొన్నారు. యుద్ధం, అంతర్గతంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు మాత్రమే పబ్లిక్ ఎమర్జెన్సీ అవుతుందన్నారు. కాబట్టి నోటిఫికేషన్ రద్దుకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు.