న్యాయవ్యవస్థతో కేంద్రానికి ఘర్షణ లేదు

కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు ఉన్నాయని, అంత మాత్రాన దీనిని ఘర్షణగా చూడకూడదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు.

Updated : 26 Mar 2023 06:05 IST

అభిప్రాయభేదాలు మాత్రమే..
కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు

మదురై(తమిళనాడు): కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు ఉన్నాయని, అంత మాత్రాన దీనిని ఘర్షణగా చూడకూడదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. సోమవారం ఆయన మదురైలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌తో కలిసి అదనపు కోర్టు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని అర్థం చేసుకోండి. సహజంగానే కొన్ని విషయాల్లో అభిప్రాయభేదాలు ఉంటాయి. దాన్ని ఘర్షణంటే ఎలా...? ఈ మొత్తం అంశాన్ని సంక్షోభంగా చూపించడం సరికాదు. విభేదాలు.. బలమైన ప్రజాస్వామ్యానికి సంకేతాలుగా భావించాలి.’’ అని మంత్రి పేర్కొన్నారు. భారత న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎలాంటి భంగం కలగనివ్వమని తెలిపారు. కార్యక్రమంలో ప్రసంగించిన సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ మాత్రం కొలీజియం వ్యవస్థకు సంబంధించి కేంద్రంతో కొనసాగుతున్న వివాదంపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. న్యాయవాద వృత్తిలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మహిళలకు సమాన అవకాశాలు లభించడం లేదు. గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. తమిళనాడులో 50 వేల మంది పురుషులు న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తుంటే అందులో కేవలం 5 వేల మంది మాత్రమే మహిళలు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కుటుంబ బాధ్యతలతో వారు ఎక్కువ పనిగంటలు పనిచేయలేరని చెప్పి వారిని శిక్షించకూడదు. ఉద్యోగం, కుటుంబాన్ని సమతూకం చేసుకొని కెరీర్‌లో ముందుకు వెళ్లాలనుకొనే మహిళలకు సంస్థాగతంగా అండగా నిలవాల్సిన బాధ్యత మన మీద ఉంది’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగేలా చూడాలని ప్రధాన న్యాయమూర్తిని స్టాలిన్‌ అభ్యర్థించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని