ఆస్తులను నష్టపరచడం స్వేచ్ఛ కాదు : సుప్రీం

కేరళ అసెంబ్లీలో విధ్వంసం సృష్టించినందుకు కొందరు ఎల్‌డీఎఫ్‌ ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్‌ కేసులను ఉపసంహరించడాన్ని బుధవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Published : 29 Jul 2021 05:32 IST

దిల్లీ: కేరళ అసెంబ్లీలో విధ్వంసం సృష్టించినందుకు కొందరు ఎల్‌డీఎఫ్‌ ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్‌ కేసులను ఉపసంహరించడాన్ని బుధవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. అలా చేయడం అంటే న్యాయ వ్యవహారాల్లో చట్టబద్ధతలేని కారణాలతో జోక్యం చేసుకున్నట్టేనని వ్యాఖ్యానించింది. ఆస్తులను ధ్వంసం చేయడం సభ్యుల వాక్‌స్వాతంత్య్రం కిందకు రాదని, చట్టబద్ధంగా నిరసన తెలపడం కూడా కాదని న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. సభ్యులకు ఉన్న ప్రత్యేక హక్కులు క్రిమినల్‌ చర్యల నుంచి మినహాయింపు పొందడం కోసం ఉద్దేశించినవి కావని స్పష్టం చేసింది. హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్వర్తించాలని పేర్కొంది. చట్టాలకు అతీతమైన సౌకర్యాలేవీ వారికి లేవని తెలిపింది. ఈ మేరకు 74 పేజీల తీర్పును వెలువరించింది. 2015 మార్చి 13న అప్పటి కేరళ ఆర్థిక మంత్రి కె.ఎం.మణి బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి సిద్ధం కాగా, ప్రతిపక్షంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌ సభ్యులు అడ్డుకున్నారు. లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్న ఆయనకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అధికారం లేదంటూ నినాదాలు చేస్తూ కంప్యూటర్లు, మైకులను పగులగొట్టారు. దీంతో రూ.2.20 లక్షల మేర నష్టం కలిగించారంటూ అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై అప్పట్లో ఆరుగురు ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసు నమోదయింది. స్పీకర్‌ అనుమతి లేకుండానే కేసులు పెట్టినందున అవి చెల్లవంటూ తరువాత అధికారంలోకి వచ్చిన ఎల్‌డీఎఫ్‌ వాటిని ఎత్తివేసింది. దీనిని సవాలు చేస్తూ తొలుత కింది కోర్టు, తరువాత కేరళ హైకోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు కాగా, కేసుల ఎత్తివేతకు అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా, అక్కడా అదే తరహా తీర్పు వచ్చింది. దాంతో వారు కేసులను ఎదుర్కోవలసి ఉంటుంది. అసెంబ్లీలో జరిగిన గొడవలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి వి.శివన్‌కుట్టి అప్పట్లో కీలకంగా వ్యవహరించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన రాజీనామాకు విపక్షాలు డిమాండు చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని