సుప్రీంకోర్టు ముంగిట హిజాబ్‌ వివాదం

హిజాబ్‌ వివాదంలో కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను హోలీ సెలవుల తర్వాత పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న పిటిషనర్ల అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.

Published : 17 Mar 2022 04:50 IST

అత్యవసర విచారణ జరపాలన్న పిటిషనర్లు
హోలీ తర్వాత పరిశీలిస్తామన్న ధర్మాసనం

దిల్లీ: హిజాబ్‌ వివాదంలో కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను హోలీ సెలవుల తర్వాత పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న పిటిషనర్ల అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.

విద్యార్థినులు వార్షిక పరీక్షలకు హాజరుకావాల్సి ఉన్నందున వ్యాజ్యాలపై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ హెగ్డే కోరారు. అయితే, ధర్మాసనం అందుకు నిరాకరించింది. సెలవుల తర్వాతే కేసును విచారణకు స్వీకరిస్తామని, దీనిపై తమకు కొంత సమయం కావాలని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పష్టం చేశారు. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ హిమా కోహ్లి సభ్యులుగా ఉన్నారు. ఇస్లాం మతంలో హిజాబ్‌ ధరించడం తప్పనిసరి ఆచారమేమీ కాదంటూ కర్ణాటక హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. పాఠశాలల్లో హిజాబ్‌ ధరించ వద్దంటూ కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సమర్థించింది. అయితే, హైకోర్టు తీర్పు రాజ్యాంగంలోని అధికరణం 21 కల్పించిన మత విశ్వాసాల ఆచరణ స్వేచ్ఛను ఉల్లంఘించేలా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. మోటారు వాహన చట్టం 1988లోని సెక్షన్‌ 129 కింద హెల్మెట్‌ ధరించడం నుంచి, విమాన ప్రయాణాల్లో కిర్పాణాలను కలిగి ఉండడం నుంచి సిక్కులకు మినహాయింపునిచ్చిన విషయాన్ని పిటిషనర్లు ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని