Corona Virus: మానవుల్లో కరోనా వృద్ధికి ఇవే కారకాలు

కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌.. మానవుల్లో రూపాంతరం చెందడానికి దోహదపడుతున్న వ్యవస్థలను దిల్లీలోని ఐఐటీ పరిశోధకులు వెలుగులోకి తెచ్చారు.

Updated : 30 May 2022 11:27 IST

వెలుగులోకి తెచ్చిన ఐఐటీ శాస్త్రవేత్తలు

దిల్లీ: కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌.. మానవుల్లో రూపాంతరం చెందడానికి దోహదపడుతున్న వ్యవస్థలను దిల్లీలోని ఐఐటీ పరిశోధకులు వెలుగులోకి తెచ్చారు. కరోనా జన్యుక్రమంలోని న్యూక్లియోటైడ్లలో మొదట సైటోసీన్‌, ఆ తర్వాత గ్వానిన్‌ (సీపీజీ)లు కలిగిన మూల జతలు కొన్ని ఉంటాయి. ఇవి వైరస్‌ పరిణామంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేల్చారు. మానవ శరీరంలోని జింక్‌-ఫింగర్‌ యాంటీవైరల్‌ ప్రొటీన్‌ (జడ్‌ఏపీ).. కరోనాలోని సీపీజీ పుష్కలంగా ఉన్న ప్రాంతాలతో బంధం ఏర్పరుస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఈ వైరస్‌.. మనిషిలోని అనేక ప్రొటీన్లను ఉపయోగించుకొని స్వీయ ఆర్‌ఎన్‌ఏలోని సీపీజీ పరిమాణాన్ని తగ్గించుకుంటున్నట్లు పేర్కొన్నారు. తద్వారా మానవ రోగ నిరోధక స్పందనను ఏమార్చగలుగుతోందని తేల్చారు. అలాగే తన సంఖ్యను పెంచుకోవడంతోపాటు మెరుగ్గా మనుగడ సాగిస్తోందని పరిశోధనలో పాలుపంచుకున్న వివేకానందన్‌ పెరుమాళ్‌ తెలిపారు. మానవుల్లో కొద్దినెలలు రూపాంతరం చెందాక కరోనా వైరస్‌లోని సీపీజీ క్షీణత రేటు చాలా ఎక్కువగా ఉంటోందని గుర్తించారు. కరోనాలోని ఆందోళనకర వేరియంట్లలో సీపీజీ పరిమాణం చాలా తక్కువగా ఉంటున్నట్లు కూడా వెల్లడైంది. ఈ వైరస్‌ జన్యుక్రమంలో యురాసిల్‌ అనే న్యూక్లియోటైడ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి పక్కన ఉన్నప్పుడు  సీపీజీలు వేగంగా క్షీణిస్తాయని పరిశోధకులు తేల్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని