Updated : 29 Jun 2022 07:28 IST

Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్‌

ఇస్లాంను అవమానించాడంటూ దర్జీ నరికివేత

గతంలో నుపుర్‌ శర్మకు మద్దతు తెలిపిన హతుడు

ప్రధాని మోదీనీ చంపేస్తామంటూ హంతకుల హెచ్చరికలు

రాజస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్తతలు

ఎన్‌ఐఏ చేతికి దర్యాప్తు బాధ్యతలు!

ఉదయ్‌పుర్‌, దిల్లీ: రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ నగరంలో మంగళవారం సంచలన హత్య చోటుచేసుకుంది. ఇస్లాం మతాన్ని అవమానించాడన్న ఆరోపణతో ఓ దర్జీని ఇద్దరు వ్యక్తులు పట్టపగలే అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. చంపేస్తామంటూ ప్రధాని మోదీకీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఉదంతంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల హింస చోటుచేసుకుంది. పరిస్థితులు మరింత అదుపు తప్పకుండా ఉదయ్‌పుర్‌లో 7పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. నెలరోజులపాటు జనం గుమిగూడకుండా రాష్ట్రవ్యాప్తంగా నిషేధాజ్ఞలు ప్రకటించారు. దర్జీ హత్యను ప్రాథమికంగా ఉగ్రవాద సంబంధిత ఘటనగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. ఉదయ్‌పుర్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు చెందిన ప్రత్యేక బృందాన్ని పంపించింది.

మహ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మకు ఉదయ్‌పుర్‌కు చెందిన దర్జీ కన్హయ్య లాల్‌ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో మద్దతు తెలిపారు. తర్వాత ఆయనకు పలు సంస్థల నుంచి బెదిరింపులు వచ్చాయి. సామాజిక మాధ్యమల్లో వ్యాఖ్యలకు సంబంధించి కన్హయ్యను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఈ నెల 15న బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన ఉదయ్‌పుర్‌లోని ధన్‌ మండీ ప్రాంతంలో మంగళవారం తన దుకాణంలో పనిచేసుకుంటుండగా సాధారణ వినియోగదారుల్లా నటిస్తూ రియాజ్‌ అఖ్తారీ, గౌస్‌ మహ్మద్‌ అక్కడికి వచ్చారు. వారిలో ఒకరి కొలతలు తీసుకున్న కన్హయ్య.. వాటిని నోట్‌ చేసుకునేందుకు వెనక్కి తిరిగారు. వెంటనే రియాజ్‌ తన వెంట తెచ్చుకున్న  కత్తితో ఆయన మెడపై వేటు వేశాడు. కన్హయ్య కిందపడి విలవిలలాడుతుండగా.. ఆయన మొండెం నుంచి తలను వేరుచేసేందుకు కత్తితో కిరాతకంగా కోశాడు. ఈ దారుణాన్ని గౌస్‌ మొబైల్‌లో వీడియో తీశాడు. అనంతరం నిందితులిద్దరూ పరారయ్యారు.

సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెట్టి..

హత్య వీడియోను కొద్దిసేపటి తర్వాత నిందితులు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అది వైరల్‌గా మారుతుండగానే.. మరో వీడియోను పోస్ట్‌ చేశారు. కన్హయ్య తల నరికేశామని అందులో పేర్కొన్నారు. ‘ఈ అగ్గి రాజేసినందుకు మోదీనీ హతమారుస్తాం’ అని హెచ్చరించారు. ఈ నెల 17న రికార్డు చేసిన మరో వీడియోనూ సోషల్‌ మీడియాలో మంగళవారం షేర్‌ చేశారు. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడులకు తెగబడేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రియాజ్‌, గౌస్‌లు ద్విచక్రవాహనంపై పారిపోతుండగా ఉదయ్‌పుర్‌ పొరుగున ఉన్న రాజ్‌సమంద్‌ జిల్లా భీమ్‌ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. రియాజ్‌ ఓ మసీదులో పనిచేస్తుంటాడని, గౌస్‌ కిరాణా కొట్టు నడుపుతుంటాడని పోలీసులు తెలిపారు.

అదనపు బలగాల మోహరింపు

దారుణ హత్యతో ఉదయ్‌పుర్‌లో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. స్థానిక మార్కెట్లలో దుకాణాలు మూతపడ్డాయి. హాథిపోల్‌ ప్రాంతంలో రెండు మోటారుసైకిళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ధన్‌ మండీ ప్రాంతంలోని ఓ మసీదుపై కొంతమంది రాళ్లు రువ్వారు. మత ఘర్షణలు తలెత్తే ముప్పు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయ్‌పుర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ ప్రకటించారు. నగరానికి 600 మంది అదనపు పోలీసులను రప్పించి భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. మరోవైపు- కన్హయ్య మృతదేహాన్ని పోలీసులు ఘటనాస్థలం నుంచి తరలించకుండా స్థానికులు అడ్డుకున్నారు. కన్హయ్య హత్యపై స్పందించిన రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌..  రెచ్చగొట్టే వీడియోలేవీ షేర్‌ చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

ఇస్లాంకు వ్యతిరేకమిది: జమైత్‌ ఉలేమా-ఎ-హింద్‌

కన్హయ్య హత్యను ‘జమైత్‌ ఉలేమా-ఎ-హింద్‌’ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి క్రూరమైన చర్యలు ఇస్లాం మతానికి వ్యతిరేకమంటూ సంస్థ ప్రధాన కార్యదర్శి మౌలానా హకీముద్దీన్‌ ఖాస్మి  ప్రకటన విడుదల చేశారు.

* నిందితులు ఈ నెల 17నే కన్హయ్యను బెదిరించారని.. రక్షణ కల్పించాల్సిందిగా ఆయన వేడుకున్నా పోలీసులు పట్టించుకోలేదని భాజపా రాజస్థాన్‌ అధ్యక్షుడు సతీశ్‌ పూనియా పేర్కొన్నారు. కన్హయ్య హత్యను విశ్వహిందూ పరిషత్‌ ఖండించింది.

* హత్యను ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా ఖండించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని