టీవీ యాంకర్‌ అరెస్టుపై హైడ్రామా

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై నకిలీ వీడియోకు సంబంధించిన కేసులో... ఓ న్యూస్‌ యాంకర్‌ అరెస్టు రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. నకిలీ వీడియో వ్యవహారంలో ఓ ప్రముఖ మీడియా సంస్థలో

Published : 06 Jul 2022 03:19 IST

 రాహుల్‌పై నకిలీ వీడియో వ్యవహారంలో ఛత్తీస్‌గఢ్‌ బృందాన్ని అడ్డుకున్న యూపీ పోలీసులు
 నిందితుడి అరెస్టు.. రాత్రివేళ బెయిల్‌పై విడుదల!

గాజియాబాద్‌, రాయ్‌పుర్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై నకిలీ వీడియోకు సంబంధించిన కేసులో... ఓ న్యూస్‌ యాంకర్‌ అరెస్టు రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. నకిలీ వీడియో వ్యవహారంలో ఓ ప్రముఖ మీడియా సంస్థలో పనిచేస్తున్న యాంకర్‌ రోహిత్‌ రంజన్‌పై ఛత్తీస్‌గఢ్‌లో కేసు నమోదైంది. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు రాయ్‌పుర్‌ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు వెళ్లారు. అయితే యూపీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. రంజన్‌ను నొయిడాలోని సెక్టార్‌-20 ఠాణాకు తరలించారు. నిందితుడిని తాము అరెస్టుచేసి, అనంతరం బెయిల్‌పై విడుదల చేశామని మంగళవారం రాత్రి ప్రకటించారు.

అసలు ఏం జరిగిందంటే...

కేరళలోని వయనాడ్‌లో తన కార్యాలయంపై దాడి చేసినవారిని చిన్నపిల్లలుగా పేర్కొంటూ, వారికి వ్యతిరేకంగా తనకు ఎలాంటి దురుద్దేశం లేదని రాహుల్‌గాంధీ ఇటీవల వీడియో సందేశమిచ్చారు. అయితే ఈ వీడియోను వక్రీకరించి.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన టైలర్‌ కన్హయ్యలాల్‌ హంతకులను ఉద్దేశించి రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఓ టీవీ ఛానల్‌ ప్రసారం చేసింది. అనంతరం, పొరపాటు జరిగిందంటూ క్షమాపణలు కోరింది. అయితే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్‌... ఆ టీవీ ఛానల్‌ యాజమాన్యం, యాంకర్‌ రోహిత్‌ రంజన్‌పై రాయ్‌పుర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో రంజన్‌ను అరెస్టు చేసేందుకు మంగళవారం ఉదయం రాయ్‌పుర్‌ పోలీసులు గాజియాబాద్‌లోని ఇందిరాపురానికి చేరుకున్నారు. అక్కడ రంజన్‌ నివాసానికి వెళ్లి ఆయన్ను ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేసేందుకు సిద్ధమవుతుండగా... గాజియాబాద్‌ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత నొయిడా పోలీసులు వచ్చారు. దీంతో ఉభయ రాష్ట్రాల పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. రాయ్‌పుర్‌ పోలీసులు అరెస్టు వారెంట్‌ చూపించినా... నొయిడా పోలీసులు బలవంతంగా రంజన్‌ను తమతో తీసుకొని వెళ్లిపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకొంది. 12 గంటల తర్వాత నొయిడా పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘శత్రుత్వం, ద్వేషాన్ని సృష్టించడం, ప్రోత్సహించడం వంటి ఆరోపణలపై యాంకర్‌ రోహిత్‌ రంజన్‌ను అరెస్టుచేశాం. ఇవి బెయిల్‌ ఇవ్వదగ్గ ఆరోపణలు కావడంతో ఆయన్ను విడుదల చేశాం’’ అని అందులో పేర్కొన్నారు.

యూపీ సీఎంను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌...

అంతకుముందు తన అరెస్టు వ్యవహారంపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌, యూపీ పోలీసులను ట్యాగ్‌ చేస్తూ రంజన్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘‘స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు నన్ను అరెస్టు చేసేందుకు మా ఇంటికి వచ్చారు. ఇది చట్టపరంగా సరైందేనా?’’ అని ప్రశ్నించారు. దీనికి రాయ్‌పుర్‌ పోలీసులు దీటుగా బదులిచ్చారు. ‘‘స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న నిబంధన లేదు. అయినా మేము సమాచారం ఇచ్చాం. మీపై ఉన్న అరెస్టు వారెంట్‌నూ చూపించాం. మీరు దర్యాప్తునకు సహకరించాలి’’ అని వారు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని