నేనేదీ కోరుకోలేదు.. పెద్దలే ప్రోత్సహించారు

ఉప రాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి స్థానానికి వెళ్లలేకపోయానన్న బాధ ఏమాత్రం లేదని, దాని గురించి ముందు నుంచీ తాను ఆలోచించలేదని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతి హోదాలో చివరిసారిగా బుధవారం మధ్యాహ్నం తన నివాసంలో విలేఖరులతో ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడారు. ఉప రాష్ట్రపతి పదవి కూడా తొలి నుంచీ ఇష్టం లేదని, ఈ ప్రోటొకాల్‌ ఆంక్షలు తన తత్వానికి సరిపడవన్నారు.

Updated : 11 Aug 2022 07:49 IST

రాష్ట్రపతి కాలేదన్న బాధ లేదు

మీడియాతో ఇష్టాగోష్ఠిలో వెంకయ్యనాయుడు

ఈనాడు, దిల్లీ: ఉప రాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి స్థానానికి వెళ్లలేకపోయానన్న బాధ ఏమాత్రం లేదని, దాని గురించి ముందు నుంచీ తాను ఆలోచించలేదని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతి హోదాలో చివరిసారిగా బుధవారం మధ్యాహ్నం తన నివాసంలో విలేఖరులతో ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడారు. ఉప రాష్ట్రపతి పదవి కూడా తొలి నుంచీ ఇష్టం లేదని, ఈ ప్రోటొకాల్‌ ఆంక్షలు తన తత్వానికి సరిపడవన్నారు. ‘నేను ఏదీ కోరుకోకపోయినా దేవుడి దయ, పెద్దల అభిమానం వల్ల అన్నీ లభించాయి. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నాకంటే సీనియర్లు ఉన్నా నన్ను సభాపక్ష నాయకుడిగా చేసి ప్రోత్సహించారు. జాతీయస్థాయి పదవులూ అలాగే దక్కాయి. వాజ్‌పేయీ మంత్రివర్గంలో సమాచార ప్రసారశాఖ, రవాణాశాఖ లాంటివి ఇస్తానంటే వద్దన్నా. ఏం కావాలో కనుక్కోమని ఆడ్వాణీని పురమాయించారు. అప్పుడు నేనే వాజ్‌పేయీ వద్దకు వెళ్లి వ్యవసాయశాఖ అడిగా. అప్పటికే మిత్రపక్ష నేత నీతీశ్‌కుమార్‌కు ఆ శాఖ కేటాయించినందున ఆయన్ను కాదనడం బాగుండదని చెప్పారు. నాకు ఆర్థికంలాంటివి అర్థం కావు కాబట్టి, గ్రామీణాభివృద్ధిశాఖ కోరినప్పుడు వాజ్‌పేయీకి నాపై అభిమానం మరింత పెరిగింది. మోదీ హయాంలోనూ పట్టణాభివృద్ధిశాఖ ఇచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతానికి చెందిన నాకు పట్టణాభివృద్ధి గురించి ఏం తెలుసని అడిగా. ఇప్పుడు గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయి.. మీకు ఇదే కరెక్టు అని చెప్పారు’ అని గతం గుర్తు చేసుకున్నారు. అరుణ్‌ జైటీ, సుష్మా స్వరాజ్‌లా ప్రఖ్యాత కళాశాలల్లో చదువుకోకపోయినా ప్రజలతో నిరంతరం మమేకం కావడమే జ్ఞానం నేర్పిందన్నారు. 

మోదీకి రెండు సూచనలు చేశా..

మోదీకి అపూర్వమైన శక్తి ఉందని, రోజుకు 14 గంటలపాటు నిరంతరాయంగా.. సీరియస్‌గా పనిచేస్తారని వెంకయ్యనాయుడు మెచ్చుకున్నారు. ‘ఆయన పనితీరును చూసి నా సతీమణి రెండు సూచనలు చేయమని చెప్పారు. అందులో ఒకటి అప్పుడప్పుడూ నవ్వుతూ ఉండటం, రెండోది రోజూ అవసరమైనంత నిద్రపోవడం. ఈ రెండూ మోదీకి చెప్పా. తర్వాత ఆయన పనిచేసే సమయంలో నవ్వడం నేర్చుకున్నారు. నిద్ర మాత్రం రాదని చెప్పేవారు’ అని వివరించారు.

పుస్తకం రాస్తే.. అనర్థాలు

మళ్లీ రాజకీయాల్లోకి రానని, క్రియాశీలకంగా ఉండటం మాత్రం మానబోనని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తూనే ఉంటానన్నారు. తన ముందుకు వచ్చే అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానన్నారు. ‘పుస్తకం రాస్తే వాస్తవాలు రాయాలి. బతికున్నవారి గురించి యథార్థాలు రాస్తే అనర్థాలు వస్తాయి’ అని చమత్కరించారు. 

ఆత్మకూరులో గెలిస్తే.. దిల్లీ దూరమయ్యేది!

1965లో ఏబీవీపీ నాయకుడిగా ఉన్నప్పుడు పహిల్వాన్‌ కాంతారావుతో జరిగిన గొడవ తనకు విద్యార్థి నాయకుడిగా గుర్తింపు తెచ్చిందని వెంకయ్యనాయుడు తెలిపారు. తర్వాత జైఆంధ్ర ఉద్యమం, జేపీ ఉద్యమం, ఎమర్జెన్సీ జైలు జీవితం రాటుదేల్చాయని పాత రోజులను స్మరించుకున్నారు. రెండుసార్లు ఉదయగిరి (నెల్లూరు జిల్లా) నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన తాను తర్వాత ఆత్మకూరు నుంచి బరిలో దిగినప్పుడు అతివిశ్వాసం దెబ్బ తీసిందన్నారు. ఆత్మకూరులో గెలిచి ఉంటే రాష్ట్ర రాజకీయాలకే పరిమితమై ఉండేవాణ్నేమోనని అభిప్రాయపడ్డారు.అందుకే  ఎప్పుడూ గెలిపించిన ఉదయగిరి, ఓడించిన ఆత్మకూరు ఓటర్లకు ధన్యవాదాలు చెబుతుంటానన్నారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ నుంచి గెలుస్తానని అనుకున్నానని.. మైనారిటీ ఓట్లు గంపగుత్తగా సలావుద్దీన్‌ ఒవైసీకి పడగా, మెజారిటీ ఓట్ల చీలికతో ఓటమిపాలయ్యాయనని చెప్పారు.

జైలు నుంచే సంజయ్‌గాంధీ సభ భగ్నం..

ఎమర్జెన్సీ సమయంలో తాము విశాఖపట్నం జైలులో ఉన్నప్పుడు సంజయ్‌గాంధీని నాటి కేంద్రమంత్రి కొత్త రఘురామయ్య విశాఖకు తీసుకువచ్చి బహిరంగ సభలో ‘ఉదయిస్తున్న భారతతార’గా అభివర్ణించారని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. అనారోగ్యం సాకుతో జైలు నుంచి ఆసుపత్రికి వెళ్లిన తాను ఆ సభను భగ్నం చేసే ప్రణాళికలో విజయవంతమైనట్లు తెలిపారు. హైదరాబాద్‌ జైలులో తరిమెల నాగిరెడ్డి, కాశీనాథ్‌ వంటి ప్రముఖులు ఉండటంతో అక్కడకు వెళ్లాలని జైలు అధికారులకు ముందే పిటిషన్‌ పెట్టుకున్నానని, సంజయ్‌ సభ భగ్నంతో హైదరాబాద్‌ జైలుకు పంపారని గుర్తు చేసుకున్నారు.


ఇష్టాగోష్ఠిలో చమత్కారాలు

* ‘అయితే ప్రెసిడెంటు, లేదా డిసిడెంటు (అసమ్మతి) ఏదీ కాకపోతే రెసిడెంటు (ఇంటికి పరిమితం)’ అనే భావన నాకు నచ్చదు.

* ‘పొజిషన్‌లో ఉన్నా, అప్పోజిషనులో ఉన్నా.. ఏ పొజిషను లేకున్నా వార్తల్లో ఉంటారు. ఇదెలా సాధ్యమ’ని ఓ మిత్రుడు అడిగాడు. మీడియాకు కావాల్సిన సమాచారం ఎప్పుడూ నా దగ్గర ఉంటుందని చెప్పా.

* భాజపా సభ్యత్వమిక వద్దు. పోస్టు ఏదిచ్చినా తీసుకోను. మళ్లీ పోస్ట్‌మ్యాన్‌ కాదలచుకోలేదు

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts