సంక్షిప్త వార్తలు(4)

కర్ణాటక రాష్ట్రం మండ్యకు చెందిన శ్రీధర్‌ అనే యువకుడిని బలవంతంగా మతమార్పిడి చేశారన్న ఆరోపణలతో 11 మందిపై హుబ్బళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తనను

Updated : 26 Sep 2022 06:15 IST

బలవంతపు మత మార్పిడిపై కేసు

హుబ్బళ్లి, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రం మండ్యకు చెందిన శ్రీధర్‌ అనే యువకుడిని బలవంతంగా మతమార్పిడి చేశారన్న ఆరోపణలతో 11 మందిపై హుబ్బళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తనను బనశంకరిలో ఒకచోట బంధించి.. బలవంతంగా హింసించారని శ్రీధర్‌ ఆరోపించారు. ఆ 11 మందీ తనను గత మే నెలలో అపహరించి తీవ్రంగా హింసించారని తెలిపారు. స్వచ్ఛందంగా మతం మారుతున్నట్లు బాండు కాగితంపై సంతకాలు చేయించుకున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను కోలుకున్న తర్వాత వేరే ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడ ప్రార్థన, ఇతర అంశాల్లో శిక్షణ ఇచ్చారని, ఏటా కనీసం ముగ్గురిని మతమార్పిడి చేయించేందుకు సహకరించాలని బెదిరించారని తెలిపారు. తన చేతిలో పిస్తోలు ఉంచి ఫొటోలు తీసిన నిందితులు... ఈ విషయం బయటకు చెబితే ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో ఉంచుతామని హెచ్చరించారని చెప్పారు. తన బ్యాంకు ఖాతాకు రూ.35వేలు బదిలీ చేసి, తనను విడిచిపెట్టారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, తనకు సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన యువతిని కలిసేందుకు హుబ్బళ్లి వచ్చినప్పుడు మరోసారి నిందితులు తనపై దాడిచేసి బెదిరించడంతో శ్రీధర్‌ తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


 

 44 వేల దిగువకు కొవిడ్‌ క్రియాశీలక కేసులు

దిల్లీ: దేశంలో కొవిడ్‌ క్రియాశీలక కేసుల సంఖ్య ఆదివారం 44 వేల దిగువకు తగ్గింది. గత 24 గంటల్లో (శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉ. 8 గంటల వరకు) కొత్తగా 4,777 మంది వైరస్‌ బారినపడగా.. 23 కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. క్రియాశీలక కేసుల సంఖ్య 43,994కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.58% నమోదైంది. దేశంలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 4,45,68,114కి చేరగా.. మహమ్మారి బారినపడి ఇంతవరకు 5,28,510 మంది ప్రాణాలు కోల్పోయారు.


భారత్‌లో తయారీకి ఎనిమిదేళ్లు

‘భారత్‌లో తయారీ’ పథకానికి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఇది భారత్‌ను ప్రపంచానికి ఉత్పత్తి కేంద్రంగా మార్చేసింది. మన దేశం అందించే అవకాశాలను ప్రపంచం గమనించేలా చేసింది. వారు ఇప్పుడు ఈ అద్భుత ప్రయాణంలో ఎంతో ఉత్సాహంగా భాగస్వాములు అవుతున్నారు.

- పీయూష్‌ గోయల్‌


విద్యార్థి ఆత్మహత్య ఘటనలో వాయుసేన సిబ్బందిపై కేసు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: శిక్షణలో ఉన్న అంకిత్‌ ఝా (27) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో భారతీయ వాయుసేనకు చెందిన ఆరుగురిపై కేసు నమోదు చేశామని గంగమ్మన గుడి పోలీసులు తెలిపారు. బెంగళూరు నగరం జాలహళ్లిలోని ఎయిర్‌ఫోర్స్‌ టెక్నికల్‌ కళాశాలలోని హాస్టల్‌లో గత మంగళవారం అంకిత్‌ ఝా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతని సోదరుడు అమన్‌ ఝా పోలీసులకు శనివారం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన సోదరుడిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. శిక్షణ ఇస్తున్న అధికారుల వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని అంకిత్‌ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వాయుసేన అధికారులు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని