చైనా సరిహద్దుల్లోకి ఆధునిక ఆయుధాలు

చైనా సరిహద్దుల వెంబడి తన ఆయుధపాటవాన్ని భారత సైన్యం గణనీయంగా పెంచుకుంటోంది. దీర్ఘశ్రేణి రాకెట్లు, శతఘ్ని వ్యవస్థలను భారీగా మోహరించింది. వీటికితోడు మరిన్ని ఆయుధాలను, మానవరహిత విమానాల (యూఏవీ)లను

Updated : 28 Sep 2022 06:05 IST

 శతఘ్నులు, రాకెట్‌ వ్యవస్థలు,  యూఏవీలను మోహరిస్తున్న భారత్‌

దిల్లీ: చైనా సరిహద్దుల వెంబడి తన ఆయుధపాటవాన్ని భారత సైన్యం గణనీయంగా పెంచుకుంటోంది. దీర్ఘశ్రేణి రాకెట్లు, శతఘ్ని వ్యవస్థలను భారీగా మోహరించింది. వీటికితోడు మరిన్ని ఆయుధాలను, మానవరహిత విమానాల (యూఏవీ)లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. సైన్యంలోని శతఘ్ని దళాలు ఇప్పటికే కె9 వజ్ర, ధనుష్‌, తేలికపాటి ఎం-777 శతఘ్నులు, పినాక రాకెట్‌ వ్యవస్థలను సమకూర్చుకున్నాయి. నిఘా అవసరాల కోసం 90 కిలోమీటర్ల పరిధి కలిగిన యూఏవీలు ఈ దళాలకు అందుతాయి. ఈ లోహవిహంగాలు ఏకబిగిన నాలుగు గంటల పాటు గగనవిహారం చేయగలవు. ప్రస్తుతం సైన్యంలో ఉన్న యూఏవీలను ఆర్మీ ఏవియేషన్‌ విభాగాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు శతఘ్ని విభాగాల అమ్ములపొదిలోనూ అవి చేరనున్నాయి. 2017లో వంద కె9 వజ్ర శతఘ్నులకు సైన్యం ఆర్డరిచ్చింది. వీటికితోడు మరో వంద శతఘ్నులను సమకూర్చుకునేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. నిజానికి కె9 వజ్రలను ఎడారి ప్రాంతంలో మోహరించేందుకు సైన్యం కొనుగోలు చేసింది. అయితే తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో సైనిక ప్రతిష్టంభన ఏర్పడ్డ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఈ శతఘ్నులను మన సైన్యం అక్కడికి తరలించింది. అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆయుధ వ్యవస్థల్లో మార్పులు చేసింది. తీవ్ర శీతల పరిస్థితులనూ తట్టుకునేలా వాటినీ తీర్చిదిద్దింది. మరింత శక్తిమంతమైన పినాక రాకెట్‌ వ్యవస్థను సమకూర్చుకునే అంశం కూడా పరిశీలనలో ఉంది. ఎక్కువ దూరం పాటు మందు గుండును ప్రయోగించేందుకు ఈ వ్యవస్థలో ఆధునిక ఎలక్ట్రానిక్‌, మెకానికల్‌ ఉపకరణాలు ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని