మతం పేరున్న పార్టీల నమోదును నిరోధించే స్పష్టమైన నిబంధన చట్టంలో లేదు

మతం పేరుతో కానీ, అటువంటి అర్థం స్ఫురించేలా ఉన్న రాజకీయ పార్టీలను కానీ నమోదు(రిజిస్టరు) చేయకుండా నిరోధించే స్పష్టమైన నిబంధన ఏదీ చట్టంలో లేదని సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం తెలిపింది.

Published : 26 Nov 2022 04:58 IST

సుప్రీంకోర్టుకు తెలిపిన ఎన్నికల సంఘం

దిల్లీ: మతం పేరుతో కానీ, అటువంటి అర్థం స్ఫురించేలా ఉన్న రాజకీయ పార్టీలను కానీ నమోదు(రిజిస్టరు) చేయకుండా నిరోధించే స్పష్టమైన నిబంధన ఏదీ చట్టంలో లేదని సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం తెలిపింది. ఒక మతానికి ప్రతీకగా పేరును కలిగి ఉన్న, లేదా మత చిహ్నాన్ని కలిగి ఉన్న రాజకీయ పార్టీలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌కు స్పందనగా ఈ విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానానికి వివరించింది. ఇప్పటికే చాలా కాలంగా మనుగడలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీల్లో అటువంటి పేరు ఓ పారంపర్యంగా వస్తోందని పేర్కొంది. పేరు, సంకేతాలు మాట ఎలా ఉన్నప్పటికీ ప్రతి రాజకీయ పార్టీ భారత రాజ్యాంగ లౌకిక, సామ్యవాద సూత్రాలు, దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వంపై విశ్వాసాన్ని ప్రకటించడంతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని నిబంధనలకు కట్టుబడి ఉండాలని తెలిపింది. రాజకీయ పార్టీల పేర్లలో ఉన్న, మతం పేరు, మత చిహ్నాలను తొలగించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని కోరుతూ సయ్యద్‌ వసీమ్‌ రిజ్వీ అలియాస్‌ జితేంద్ర త్యాగి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి సమాధానమివ్వాలన్న జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌ ధర్మాసం ఆదేశానుసారం ఎన్నికల సంఘం(ఈసీ) అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాజకీయ పార్టీల పేర్లలో మత ప్రస్తావన ఉండరాదని ప్రతిపాదిస్తూ 1994లో లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారని, ఆమోదం పొందకముందే సభ రద్దు కావడంతో దాని గడువు ముగిసిపోయిందని ఈసీ తెలిపింది. అయితే, 2005లో ఎన్నికల సంఘం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని.. రాజకీయ పార్టీల పేర్లలో మత ప్రస్తావన ఉంటే రిజిస్టరు చేయబోమని స్పష్టం చేసిందని పేర్కొంది. అప్పటికే, ఈసీ వద్ద నమోదైన ఉన్న పార్టీలకు ఇది వర్తించదని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని