యాంటీబయాటిక్స్‌ అతి వాడకంతో అనర్థాలు

కొద్దిపాటి జ్వరం వచ్చినా, గొంతులో నొప్పిగా అనిపించినా వెంటనే యాంటీబయాటిక్స్‌ వాడటం చాలామందికి ఉన్న అలవాటు. కొందరు వైద్యులూ వీటిని సూచిస్తున్నారు.

Updated : 28 Nov 2022 05:22 IST

ఇప్పటికే పలు వ్యాధులకు ఈ ఔషధాల నిరోధకత
వ్యాధినిర్ధారణ సరిగా చేశాకే సూచించాలి
వైద్యులకు ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు

దిల్లీ: కొద్దిపాటి జ్వరం వచ్చినా, గొంతులో నొప్పిగా అనిపించినా వెంటనే యాంటీబయాటిక్స్‌ వాడటం చాలామందికి ఉన్న అలవాటు. కొందరు వైద్యులూ వీటిని సూచిస్తున్నారు. ఇకపై అలా చేయొద్దని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) పేర్కొంది. స్వల్ప జ్వరానికి, వైరల్‌ బ్రాంకైటిస్‌ లాంటి లక్షణాలకు అవి వాడొద్దని తెలిపింది. చర్మం, మృదు కణజాల ఇన్ఫెక్షన్లు, సామూహిక నిమోనియా లాంటివి వస్తే అయిదు రోజులు, ఆసుపత్రుల్లో వచ్చే నిమోనియాకు 8 రోజులు వాడాల్సిందిగా సూచించాలని తాజా మార్గదర్శకాల్లో చెప్పింది. ఇన్ఫెక్షన్‌ వచ్చినప్పుడు కేవలం జ్వరం, ప్రోకాల్సిటోనిన్‌ స్థాయి, తెల్ల రక్తకణాల కౌంట్‌, కల్చర్‌, రేడియాలజీ పరీక్షలతో అదేంటో తెలుసుకునే బదులు వ్యాధి ఏంటన్నది తెలుసుకోడానికి క్లినికల్‌ డయాగ్నసిస్‌ బాగా ఉపయోగపడుతుందని ఐసీఎంఆర్‌ తన మార్గదర్శకాల్లో వివరించింది. తీవ్రంగా జబ్బు పడినవారికే ఎంపిరిక్‌ యాంటీబయాటిక్‌ చికిత్స చేయాలంది. తీవ్రమైన సెప్సిప్‌, సెప్టిక్‌ షాక్‌, నిమోనియా, నెక్రోటైజింగ్‌ ఫాసిటిస్‌ లాంటి సందర్భాల్లోనే ఎంపిరిక్‌ యాంటీబయాటిక్‌ చికిత్స సూచిస్తారు.

నిరోధకత ఎలా పెరిగిపోతోందంటే..

నిమోనియా, సెప్టిసేమియా లాంటి వ్యాధులకు ఐసీయూలోనే ఉపయోగించే శక్తిమంతమైన యాంటీబయాటిక్‌ అయిన కార్బాపెనెమ్‌ ఇకపై భారతదేశంలో చాలామందికి ఉపయోగపడదని గత ఏడాది ఐసీఎంఆర్‌ చేసిన సర్వేలో తేలింది. వాళ్లందరికీ యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ రావడం వల్లే ఇలా జరుగుతోంది. దీనివల్ల ఇప్పుడు అందుబాటులో ఉన్న మందులతో కొన్నిరకాల వ్యాధులకు చికిత్స చేయడం కష్టమవుతోంది. ఈ-కోలి బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల చికిత్సకు వాడే ఇమిపెనెమ్‌ నిరోధకత 2016లో 14% మందికే ఉండగా, 2021 నాటికి అది 36%కు చేరుకుంది. కొన్నిరకాల యాంటీబయాటిక్‌లతో క్లెబ్సియెల్లా న్యుమోనియా 2016లో 65 శాతం తగ్గగా, 2020లో 45%, 2021లో 43% మాత్రమే తగ్గింది. కార్బాపెనెమ్‌ అనే మరో యాంటీబయాటిక్‌ను కూడా చాలావరకు ఇన్ఫెక్షన్లు తట్టుకుంటున్నాయి. తీవ్రంగా జబ్బుపడిన రోగుల్లో 70% మూత్రకోశ ఇన్ఫెక్షన్లకు ఎసినెటోబాక్టర్‌ బౌమానీ కారణమవుతోంది. ఇది కార్బాపెనెమ్‌ను తట్టుకోవడంతో ఈ తరహా రోగులకు చికిత్స చేయడం పెద్ద సవాలుగా మారుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని