గోధ్రా నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దు

గోధ్రా రైలు దహనం కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్లపై గుజరాత్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యతిరేకత వ్యక్తం చేసింది. వారికి బెయిల్‌ ఇవ్వొద్దని కోరింది.

Published : 04 Dec 2022 05:19 IST

దోషుల పిటిషన్లను వ్యతిరేకించిన గుజరాత్‌

దిల్లీ: గోధ్రా రైలు దహనం కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్లపై గుజరాత్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యతిరేకత వ్యక్తం చేసింది. వారికి బెయిల్‌ ఇవ్వొద్దని కోరింది. వారి రాళ్లదాడి కారణంగానే దహనమవుతున్న కోచ్‌ నుంచి ప్రయాణికులు తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయారని వివరించింది. గుజరాత్‌లోని గోధ్రా వద్ద 2002, ఫిబ్రవరి 27న కొందరు సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలును దహనం చేయడంతో ఎస్‌-6 కోచ్‌లో ప్రయాణిస్తున్న 59 మంది కరసేవకులు మరణించగా.. ఈ ఘటన ఆ రాష్ట్రంలో అల్లర్లకు దారితీసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, న్యాయమూర్తి జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నిందితులు ఇప్పటికే 17-18 సంవత్సరాలు జైలుజీవితం అనుభవించిన కారణంగా వారి పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవచ్చని గుజరాత్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. దోషులు చేసింది సాధారణ రాళ్లదాడి కాదని, వీరి వల్ల ప్రయాణికులు కాలిపోతున్న బోగీలోంచి బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయారని కోర్టుకు వివరించారు. దోషుల బెయిల్‌ పిటిషన్లు 2017 అక్టోబరులో గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 11 మందికి విధించిన మరణశిక్షను గుజరాత్‌ హైకోర్టు జీవితఖైదుగా మార్చిందని గుర్తుచేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. రైలు దహనంపై దోషుల వ్యక్తిగత పాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలపాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను డిసెంబరు 15కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని