ఆసుపత్రిలో నలుగురు నవజాత శిశువుల మృతి

ఛత్తీస్‌గఢ్‌ సర్గుజా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం(ఎస్‌ఎన్‌సీయూ)లో నలుగురు నవజాత శిశువులు సోమవారం మృతి చెందారు.

Published : 06 Dec 2022 04:59 IST

విద్యుత్తు సరఫరాలో అంతరాయమే కారణమన్న బంధువులు

ఛత్తీస్‌గఢ్‌ సర్గుజా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం(ఎస్‌ఎన్‌సీయూ)లో నలుగురు నవజాత శిశువులు సోమవారం మృతి చెందారు. రాజధాని రాయ్‌పుర్‌కు 300 కిలోమీటర్ల దూరంలోని అంబికాపుర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఉదయం 5.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య ఈ మరణాలు సంభవించాయి. శిశువుల్లో ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారని, విద్యుత్తు సరఫరాలో అంతరాయం కారణంగానే మరణాలు సంభవించాయని శిశువుల బంధువులు, కుటుంబసభ్యులు ఆరోపించారు. అధికారులు మాత్రం విద్యుత్తు సరఫరాలో అంతరాయానికి, శిశువుల మృతికి సంబంధం లేదని చెబుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక 1 గంట నుంచి 1.30 గంటల మధ్య విద్యుత్తు సరఫరాలో ఆటంకాలు ఏర్పడగా సిబ్బంది సరిచేశారని, ఎస్‌ఎన్‌సీయూకు ఈ అంతరాయాలతో సంబంధం లేదని జిల్లా కలెక్టర్‌ కుందన్‌కుమార్‌ విలేకరులకు తెలిపారు. ఎస్‌ఎన్‌సీయూకు ప్రత్యేక విద్యుత్తు సరఫరా వ్యవస్థ ఉందన్నారు. నవజాత శిశువుల కేంద్రంలో ప్రస్తుతం 30 నుంచి 35 మంది శిశువులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక సమర్పించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టి.ఎస్‌.సింగ్‌దేవ్‌ ఆరోగ్యశాఖ కార్యదర్శిని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని