నకిలీ నోట్లు, నల్లధనం జరాసంధుడిలాంటివి

నకిలీ నోట్లు, నల్లధనం, ఆర్థిక ఉగ్రవాదం కూడా జరాసంధుడిలాంటివేనని, వాటిని ముక్కముక్కలుగా నరకాల్సిందేనని కేంద్రం పేర్కొంది.

Published : 06 Dec 2022 04:59 IST

వాటిని ముక్కలు ముక్కలుగా నరకాల్సిందే
పెద్దనోట్ల రద్దు సమర్థిస్తూ కేంద్రం వాదనలు

దిల్లీ: నకిలీ నోట్లు, నల్లధనం, ఆర్థిక ఉగ్రవాదం కూడా జరాసంధుడిలాంటివేనని, వాటిని ముక్కముక్కలుగా నరకాల్సిందేనని కేంద్రం పేర్కొంది. పెద్ద నోట్ల రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారిస్తున్న జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ముందు సోమవారం అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి వాదనలు వినిపించారు. ‘‘రద్దుకు ముందు అధ్యయనం చేసి ఉండాల్సిందని పిటిషనర్లు చెబుతున్నారు. కానీ దశాబ్దానికి పైగా ఈ మూడు (నకిలీ నోట్లు, నల్లధనం, ఉగ్రవాదులకు ఆర్థికసాయం) అంశాలపై రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కేంద్రం కసరత్తు చేస్తూనే ఉన్నాయి. అవి జరాసంధుడిలాంటివి. వాటిని ముక్కముక్కలుగా నరకాల్సిందే, లేకుంటే అవి ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి’’ అని అన్నారు. ఆర్థిక విధానాలపై న్యాయసమీక్ష చేసేటపుడు న్యాయస్థానాలు నియంత్రణ పాటించాలని కూడా పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్దేశిత లక్ష్యాలను సాధించలేదన్న వాదనలనూ అటార్నీ జనరల్‌ తప్పుపట్టారు. 

ఛారిటీ ఉద్దేశం.. మతమార్పిడి కాకూడదు: సుప్రీం

బలవంతపు మత మార్పిళ్లు.. తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. ఛారిటీ ఉద్దేశం మతమార్పిడి కాకూడదని, ప్రలోభాలు ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. భయపెట్టి, బెదిరించి, బహుమతులిచ్చి, ఆర్థిక ప్రయోజనాలను ఆశగా చూపి మోసపూరితంగా జరుగుతున్న మత మార్పిళ్లపై తగిన చర్యలు తీసుకొనేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ భాజపా నేత, న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ వేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషన్‌ విచారణార్హతపై ఓ న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను న్యాయమూర్తులు తప్పుపట్టారు. ‘‘విషయాన్ని సాంకేతికంగా చూడకండి. ఇక్కడ ఓ పరిష్కారం కోసం మేం ఉన్నాం. విషయాలను సరిదిద్దడానికి కూర్చున్నాం. సదుద్దేశంతో చేపట్టిన ఏ కార్యక్రమాన్నైనా స్వాగతించాలి. ప్రతికూల భావనతో చూడకండి. ఇది తీవ్రమైన అంశం. మన రాజ్యాంగానికే విరుద్ధం. భారతదేశంలో ఉన్నప్పుడు.. దేశ సంస్కృతికి అనుగుణంగా వ్యవహరించాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


ఫైలింగ్‌ నుంచి లిస్టింగ్‌ వరకు సామర్థ్యాన్ని పెంచడానికి హ్యాకథాన్‌

ఈనాడు, దిల్లీ: కేసుల ఫైలింగ్‌, లిస్టింగ్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి రిజిస్ట్రీ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి అనువైన పరిష్కారాల కోసం హ్యాకథాన్‌ నిర్వహించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా నిర్వహించడం కోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. వినూత్నంగా ఆలోచించి సమస్యలకు సరికొత్త పరిష్కారాలు కనుగొనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని కోర్టులో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ పర్యవేక్షణ, మార్గదర్శనంలో నిర్వహిస్తారు. సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌, అడ్వొకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ సభ్యులు కూడా ఇందులో పాల్గొని వ్యవస్థను మెరుగుపరచడానికి సూచనలు, సలహాలు, ఆలోచనలు అందివ్వాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలో వెలువడుతుంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు