Anand Mohan: దోషిగా తేలితే నన్ను ఉరితీయండి: బిహార్‌ మాజీ ఎంపీ ఆనంద్‌ మోహన్

బిహార్‌ మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్‌ ఆనంద్‌ మోహన్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐఏఎస్‌ అధికారి జి.కృష్ణయ్య హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలైన అతడు..తాను దోషి అని ప్రభుత్వం తేల్చితే ఉరిశిక్షకైనా సిద్ధమన్నాడు.

Published : 12 May 2023 19:13 IST

పట్నా: ఐఏఎస్‌ అధికారి జి.కృష్ణయ్య హత్య కేసులో 14 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించి విడుదలైన బిహార్‌ (Bihar) మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్‌ ఆనంద్‌ మోహన్‌ సింగ్‌ (Anand Mohan Singh).. ఈ కేసులో తాను నిర్దోషినని ప్రకటించాడు. బిహార్‌లోని అరారియాలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన అతడు తాను దోషిగా తేలితే ఉరిశిక్షనైనా స్వీకరిస్తానన్నాడు. ‘‘ఈ దేశం ఎవరి సొత్తు కాదు. చట్టాన్ని, రాజ్యంగాన్ని నేను నమ్ముతాను. అందుకే 15 ఏళ్లకు పైగా జైలుశిక్ష అనుభవించాను. నేను ‘దోషి’ అని ప్రభుత్వం తేల్చితే ఉరిశిక్షకైనా నేను సిద్ధమే’’ అని ఆనంద్‌ మోహన్‌ పేర్కొన్నాడు.

బిహార్‌ ప్రభుత్వం జైలు నిబంధనలు సవరించిన తర్వాత గత నెలలో ఆనంద్‌ మోహన్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. అంతకుముందు ఉన్న నిబంధనల ప్రకారం.. ‘విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల హత్య కేసులో దోషిగా తేలిన వారెవరైనా శిక్ష నుంచి ఉపశమనం పొందడానికి అర్హులు కాదు’. ఈ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో 27 మంది దోషులతో సహా ఆనంద్‌ మోహన్‌ విడుదలకు మార్గం సుగమమైంది.

1994లో గ్యాంగ్‌స్టర్‌, బిహార్‌ పీపుల్స్‌ పార్టీ (బీపీపీ) నాయకుడు ఛోటన్‌ శుక్లాను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంతో రాష్ట్రంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ సమయంలోనే దళిత ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్యను రాళ్లతో తీవ్రంగా కొట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులను రెచ్చగొట్టి కృష్ణయ్య హత్యకు కారణమయ్యాడన్న ఆరోపణలపై ఆనంద్‌ మోహన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో దిగువ కోర్టు 2007లో మరణశిక్ష విధించింది. అయితే, పట్నా హైకోర్టు ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. ఇదిలా ఉంటే, ఆనంద్‌ మోహన్‌ను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని