Orphans: అనాథ పిల్లల చదువు కోసం ₹ 101 కోట్లతో సీఎం ప్రత్యేక నిధి!

తన చిన్నతనంలో జరిగిన ఘటన స్ఫూర్తితో అనాథ పిల్లల చదువు కోసం రూ. వంద కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్ సుక్కు తెలిపారు. 

Published : 02 Jan 2023 00:10 IST

సిమ్లా: నూతన సంవత్సరం ప్రారంభం రోజున అనాథ పిల్లలకు హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఉన్న సుమారు ఆరువేల మంది అనాథ పిల్లల (Orphans) చదువు కోసం ₹ 101 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్ సుక్కు ప్రకటించారు. ‘ముఖ్యమంత్రి సుఖశ్రయ సహాయతా కోశ్‌’ పేరుతో ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నిధికి అధికార కాంగ్రెస్ (Congress) పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ₹ లక్ష చొప్పున తమ తొలి జీతం నుంచి విరాళం అందించినట్లు తెలిపారు. దాంతోపాటు రాష్ట్రంలోని పారిశ్రామిక వర్గాల నుంచి కూడా విరాళాలు సేకరించనున్నారు. 

‘‘ రాష్ట్రంలోని అనాథాశ్రమాల్లో ఉన్న పిల్లలు, తండ్రిని కోల్పోయి తల్లి మాత్రమే ఉన్నవారికి, తల్లిదండ్రులను కోల్పోయి బంధువుల సమక్షంలో పెరుగుతున్న పిల్లలు ఉన్నత విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధి నుంచి సాయం అందిస్తుంది’’ అని సీఎం సుక్కు తెలిపారు.  భాజపా ఎమ్మెల్యేలు కూడా తమ వంతు సాయాన్ని అందించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులకు నెలవారీ ఖర్చుల నిమిత్తం ₹ నాలుగువేల నగదును రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. ఇందుకోసం ఎలాంటి ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరంలేదు. దీంతోపాటు పండుగలకు మరో ₹ 500 అందజేయనున్నారు. 

తన చిన్నతనంలో జరిగిన సంఘటన స్ఫూర్తితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సీఎం తెలిపారు. ‘‘ పాఠశాల రోజుల్లో  నాకో స్నేహితుడు ఉండేవాడు. అతడు అనాథ. ప్రతి పండుగకు అతణ్ని నేను మా ఇంటికి తీసుకెళ్లేవాణ్ని. అలా ఒక రోజు నన్ను తీసుకెళ్తున్నావు సరే.. నాతోపాటు ఆశ్రమంలో 40 మంది ఉన్నారు. వాళ్ల పరిస్థితి ఏంటి? అని అడిగాడు. ఆ ప్రశ్నతో భవిష్యత్తులో  నేను అధికారం చేపడితే అనాథల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని సీఎం సుక్కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని