Kabul: కాబుల్‌లో రాకెట్‌ దాడి.. చిన్నారి మృతి.. అమెరికా సైన్యం మరో దాడి!

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌ నగరంలో మరోసారి పేలుడు సంభవించింది.

Updated : 29 Aug 2021 20:33 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో రాకెట్‌ దాడి జరిగింది. మరో ఉగ్రదాడి జరగొచ్చన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఘటన వెలుగు చూడడంతో కలకలం రేగింది. అమెరికా సైనికులే లక్ష్యంగా ఐసిస్‌ ఉగ్రవాదులు ఈ రాకెట్‌ దాడికి పాల్పడి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతిచెందినట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమని ఏ ఉగ్ర సంస్థా ప్రకటించుకోలేదు.

అమెరికా మరో దాడి..

మరోవైపు అఫ్గానిస్థాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆత్మాహుతికి యత్నించిన దళ సభ్యుడిని అమెరికా బలగాలు మట్టుబెట్టాయి. ఓ వైపు తమ దేశ పౌరుల తరలింపు ప్రక్రియను చేపడుతున్న వేళ ఆత్మాహుతి దాడికి ఓ వాహనంలో సిద్ధంగా ఉన్న వ్యక్తిపై అమెరికా బలగాలు వైమానిక దాడి జరిపాయని తాలిబన్‌ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. మరణించిన వ్యక్తి ఐసిస్‌-కె ఉగ్రవాద ముఠాకు చెందిన వాడిగా భావిస్తున్నారు. ఒకే రోజు రెండు వేర్వేరు ఘటనలతో మరోసారి కాబుల్‌ దద్దరిల్లింది.

ఇటీవల కాబుల్‌ విమానాశ్రయం వద్ద జరిగిన జంట పేలుళ్ల ఘటనలో 100 మందికి పైగా మరణించారు. ఈ ఘటనలో 13 మంది అమెరికా సైనికులు  కూడా మరణించారు. ఆత్మాహుతి దాడికి సూత్రధారిగా ఉన్న ఉగ్రవాది సహా ఇద్దరు కీలక ముష్కరుల్ని అమెరికా బలగాలు శనివారం మట్టుబెట్టాయి. తమ సైనికులను బలిగొన్న ఉగ్రవాదుల్ని విడిచిపెట్టేది లేదని ప్రతినబూనిన అగ్రరాజ్యం.. ఆ ప్రకారం వైమానిక దాడులకు దిగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని