మన్‌సుక్‌ను పిలిచిన తావ్‌డే అతడే..!

ముఖేశ్‌ అంబానీకి బాంబు బెదిరింపుల కేసు దర్యాప్తు కీలక ఘట్టానికి చేరింది. స్కార్పియో యజమాని మన్‌సుక్‌ హిరేన్‌ను హత్యకేసులో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు సచిన్‌ వాజేనే ప్రథమ నిందితుడని పేర్కొంది. మన్‌సుక్‌ హిరేన్‌ కేసును తాము ఛేదించినట్లు ముంబయి ఏటీఎస్‌

Updated : 22 Mar 2021 15:06 IST

‘హిరేన్‌’ కేసును ఛేదించినట్లు ఏటీఎస్‌ చీఫ్‌ పోస్టు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ముఖేశ్‌ అంబానీకి బాంబు బెదిరింపుల కేసు దర్యాప్తు కీలక ఘట్టానికి చేరింది. స్కార్పియో యజమాని మన్‌సుక్‌ హిరేన్‌ను హత్యకేసులో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు సచిన్‌ వాజేనే ప్రథమ నిందితుడని పేర్కొంది. మన్‌సుక్‌ హిరేన్‌ కేసును తాము ఛేదించినట్లు ముంబయి ఏటీఎస్‌ చీఫ్‌ శివదీప్‌ తన ఫేసుబుక్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఈ కేసును ఎన్‌ఐఏ తన చేతిలోకి తీసుకొన్న మరుసటి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం. ‘‘నా కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన మన్‌సుక్‌ హిరేన్‌ కేసును మేము ఛేదించాము. నాతో కలిసి రాత్రింబవళ్లు పనిచేసి చట్టబద్ధమైన మార్గంలో ఈ కేసును పరిష్కరించిన మా బృందానికి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.  శనివారం వినాయక్‌ షిండే అనే మాజీ కానిస్టేబుల్‌, నరేష్‌ ధారే అలియాస్‌ నరేష్‌ గౌర్‌ అనే బుకీని అరెస్టు చేశారు. 

మన్‌సుక్‌కు కాల్‌ చేసింది అతడే..

గతంలో జరిగిన ఓ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో శిక్షకు గురై గతేడాది పెరోల్‌పై బయటకు వచ్చిన షిండేనే మన్‌సుఖ్‌కు కాల్‌ చేసినట్లు తేలింది. మార్చి4 తేదీన రాత్రి మన్‌సుక్‌కు షిండే కాల్‌ చేశాడు. కండీవలై  స్టేషన్‌ నుంచి కాల్‌ చేస్తున్నానని తన పేరు ‘తావ్‌డే’ అని పరిచయం చేసుకొన్నాడు. నగర శివార్లలోని కండీవలైకు రావాల్సిందిగా ఆదేశించాడు. దీంతో మన్‌సుక్‌ ఈ విషయాన్ని తన భార్య విమలకు చెప్పి వెళ్లాడు. రాత్రి 11 గంటలకు విమల తన భర్తకు ఫోన్‌ చేయగా అటువైపు నుంచి స్పందన రాలేదు. ఆ మర్నాడే అతడి మృతదేహం బయటపడింది. 

ఐదు సిమ్‌కార్డులు ఇలా..

ఇక సచిన్‌ వాజే, వినాయక్‌ షిండే ఉపయోగించిన సిమ్‌కార్డులను గుజరాత్‌ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వీటిని నరేష్‌ గౌర్‌ కొనుగోలు చేసి వీరికి ఇచ్చాడు. వీరిలో షిండే నరేష్‌కు అసాంఘిక కార్యకలాపాల్లో సాయం చేస్తుంటాడు. 

స్కార్పియో తాళాలు హిరేనే ఇచ్చాడా..?

అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాలతో లోడ్‌ చేసిన స్కార్పియో తాళాలను మన్‌సుక్‌ హిరేనే స్వయంగా సచిన్‌ వాజే చేతికి ఇచ్చి ఉంటారనే అనుమానాలు ఉన్నాయి. వాహనం పోయిందనే హిరేన్‌ కేసు ఫైల్‌ చేయడానికి ముందు రోజున సచిన్‌ వాజేను కలిసినట్లు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌(సీఎస్‌ఎంటీ) వద్ద సీసీటీవీ పుటేజీలో గుర్తించారు. ఆ రోజు వాజే కమిషనరేట్‌ నుంచి మెర్సిడెస్‌ బెంజ్‌ కారులో సీఎస్‌ఎంటీ వద్దకు వచ్చాడు. అదే సమయంలో హిరేన్‌ నడుచుకొంటూ కారువైపు వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు కారులో కూర్చొని 10నిమిషాలు మాట్లాడుకొన్నారు. తర్వాత హిరేన్‌ కారు దిగి వెళ్లిపోయాడు. ములంద్-ఎయిరోలి వద్ద నిలిపేసిన స్కార్పియో తాళాలను హిరేన్‌ ఈ సమయంలోనే సచిన్‌కు అప్పగించి ఉంటారని ఏటీఎస్‌ బృందం అనుమానిస్తోంది. ఆ తర్వాత స్కార్పియోను సచిన్‌ వాజే తన ఇంటి ప్రాంగాణలోనే నిలిపి ఉంచాడు. 

కారు ఇంజిన్‌.. ఛాసిస్‌ నెంబర్లను అరగదీసి..

ఫిబ్రవరి 25న  ఆ కారు పేలుడు పదార్థాలతో అంబానీ స్వగృహం ఆంటిలియా ఎదుట ప్రత్యక్షమైంది. ఆ వాహనానికి అమర్చింది దొంగ  నెంబర్‌ ప్లేటు అని గుర్తించిన తర్వాత పోలీసులు ఇంజిన్‌ నెంబర్‌, ఛాసిస్‌ నెంబర్‌ను పరిశీలించారు. అవి కూడా గ్రైండింగ్‌ మిషిన్‌తో అరగదీసినట్లు గుర్తించారు. చివరికి ఓ స్టిక్కర్‌ ఆధారంగా  ఆ కారు యజమాని మన్‌సుక్‌ హిరేన్‌గా గుర్తించారు. 

తనపైనే ఫిర్యాదు చేయించుకొన్న క్రిమినల్‌ మైండ్‌..

ఫిబ్రవరి 26వ తేదీన ఏటీఎస్‌ మన్‌సుక్‌ను ఇంటరాగేషన్‌ చేసింది.  పేలుడు పదార్థాలకు సంబంధించిన కేసు కావడంతో రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ 27వ తేదీన ఇంటరాగేషన్‌కు రమ్మని పిలిచింది. కానీ, అతను 27వ తేదీన ఓ లాండ్‌క్రూజర్‌ ప్రాడో కారులో సచిన్‌వాజేతో కలిసి కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. అదే రోజు వాజే సిబ్బందిని పంపి తన నివాస గృహానికి ఉన్న సీసీ కెమెరా డీవీఆర్‌లను తెప్పించారు. 2వ తేదీన ముఖ్యమంత్రి, హోం మంత్రి సహా పలువురు ప్రభుత్వ పెద్దలకు మన్‌సుక్‌ ఓ లేఖ రాశారు. తనను  ఏటీఎస్‌, క్రైం ఇంటెలిజెన్స్‌ సెల్‌, మీడియా మానసికంగా వేధిస్తోందని దానిలో పేర్కొన్నారు. ఈ లేఖను కూడా వాజేనే రాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 4వ తేదీ రాత్రి మన్‌సుక్‌ అదృశ్యమయ్యారు. 5వ తేదీన అతని మృతదేహం లభించింది. అదే రోజు సచిన్‌ వాజేపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, హిరేన్‌ భార్య విమల ఆరోపణలు చేశారు. చివరికి మన్‌సుఖ్‌ మృతదేహం పోస్టు మార్టం సమయంలో కూడా వాజే అక్కడే ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని