బర్డ్‌ఫ్లూ అలర్ట్‌: దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పక్షులకు వ్యాప్తి చెందుతున్న బర్డ్‌ఫ్లూ వ్యాధి కలవరం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో ఈ వ్యాధి నిర్దారణ అయినట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దేశరాజధానిలోకి లైవ్‌ బర్డ్స్‌ దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

Published : 09 Jan 2021 20:06 IST

దిల్లీ: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలను బర్డ్‌ఫ్లూ కలవరపెడుతోంది. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో ఈ వ్యాధి నిర్ధారణ అయినట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దేశరాజధానిలోకి లైవ్‌ బర్డ్స్‌ దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా దిల్లీలో ఇప్పటి వరకు ఒక్క బర్డ్‌ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని సమాచారం. ‘దిల్లీలో ఇప్పటి వరకూ పక్షుల నుంచి 104 నమూనాలను సేకరించాం. వాటిని పరీక్షల నిమిత్తం జలంధర్‌లోని లేబొరేటరీకి పంపించాం. మేం పంపిన నమూనాల్లో ఎలాంటి బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవని గుర్తించారు. లేబొరేటరీ నుంచి పూర్తి స్థాయి ఫలితాలు ఆదివారం మాకు అందుతాయి. ఆయా నివేదికలను బట్టి మేం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. 

కాగా, దిల్లీలోని మయూర్‌ విహార్‌ పార్కులో గత మూడు నాలుగు రోజులుగా దాదాపు వంద కాకులు చనిపోవడం గమనార్హం. కాకుల మరణాల విషయమై ర్యాపిడ్‌ ప్రతిస్పందన బృందాలు విచారణ జరుపుతున్నాయని కేజ్రీవాల్‌ చెప్పారు. దిల్లీవ్యాప్తంగా ప్రతి జిల్లాలో మేజిస్ట్రేట్‌ నేతృత్వంలో ఓ పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేజ్రీవాల్‌ ప్రకటించారు. దిల్లీలోని అన్ని పౌల్ట్రీ మార్కెట్లపై వెటర్నరీ వైద్య బృందాల పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఘాజీపూర్‌లోని పౌల్ట్రీ మార్కెట్‌ పది రోజుల పాటు మూసేసినట్లు వెల్లడించారు. 

కాగా దేశవ్యాప్తంగా కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి జరుగుతున్నట్లు కేంద్రం శనివారం స్పష్టం చేసింది. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కేంద్రం ఆయా రాష్ట్రాలను ఆదేశించింది. కేరళలో ఇప్పటి వరకు వేలాది కోళ్లు, బాతులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 

ఇదీ చదవండి

జనవరి 16 నుంచి కరోనా టీకా పంపిణీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని