Importes: 2050 నాటికి మూడో అతిపెద్ద దిగుమతిదారుగా భారత్‌

2050 నాటికి భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద దిగుమతిదారుగా అవతరిస్తుందని బ్రిటన్‌ అంతర్జాతీయ వాణిజ్య శాఖ తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రపంచ దిగుమతుల్లో 5.9 శాతం వాటాతో.. చైనా, అమెరికా తరువాతి స్థానంలో నిలుస్తుందని పేర్కొంది...

Updated : 21 Sep 2021 05:11 IST

బ్రిటన్‌ నివేదికలో వెల్లడి

లండన్‌: 2050 నాటికి భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద దిగుమతిదారుగా అవతరిస్తుందని బ్రిటన్‌ అంతర్జాతీయ వాణిజ్య శాఖ తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రపంచ దిగుమతుల్లో 5.9 శాతం వాటాతో.. చైనా, అమెరికా తరువాతి స్థానంలో నిలుస్తుందని పేర్కొంది. ప్రస్తుతం.. 2.8 శాతం వాటాతో భారత్‌ ఎనిమిదో స్థానంలో ఉంది. గ్లోబల్ ట్రేడ్ ఔట్‌లుక్ నివేదిక ప్రకారం.. 2030 నాటికి 3.9 శాతం వాటాతో నాల్గో స్థానానికి చేరుకుంటుంది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా దిగుమతుల ధోరణుల్లోనూ మార్పులు చోటుచేసుకుంటాయని నివేదిక పేర్కొంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో దిగుమతుల వాటా తగ్గుతుందని, అదే సమయంలో ఆసియా దేశాల్లో పెరగనుందని తెలిపింది. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రధానంగా ఆహార, ప్రయాణ, డిజిటల్ సేవల రంగాల్లో మార్పులు కనిపిస్తాయని పేర్కొంది. 2019- 2050 మధ్య ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 56 శాతం ఇండో-పసిఫిక్ రీజియన్‌ నుంచే నమోదవుతుందని అంచనా వేసింది.

తూర్పు దిశగా ఆర్థిక శక్తి..

ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రం కూడ క్రమంగా తూర్పు దిశగా మళ్లుతోందని నివేదిక వెల్లడించింది. చైనా వేగవంత పురోగతి దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. 2030 నాటికి.. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆ సమయానికి చైనా, అమెరికా.. ప్రపంచ జీడీపీలో 22 శాతం వాటా కలిగి ఉంటాయని నివేదికలో వెల్లడైంది. మరోవైపు 2050 నాటికి ప్రపంచ జీడీపీలో 6.8 శాతం వాటాతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల ర్యాంకింగ్‌లో భారత్‌ మూడో స్థానానికి ఎగబాకుతుందని తెలిపింది. ప్రస్తుతం.. 3.3 శాతం వాటాతో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. భవిష్యత్తులో భారత్‌తోపాటు ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు వేగంగా అభివృద్ధి చెందుతాయి.. కానీ, ఈ క్రమంలో అనేక సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. అనుకరణ నుంచి ఆవిష్కరణ(ఇమిటేషన్‌ టు ఇన్నోవేషన్‌)కు మారడం, ఆదాయ అసమానతలను అధిగమించడం, అప్పులు, కొవిడ్ పరిస్థితుల నష్టాల నుంచి బయటపడటం అవసరమని నివేదిక సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని