IndiGo: మరో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 24 గంటల్లో రెండో ఘటన

దిల్లీ నుంచి రాంచీ బయల్దేరిన ఇండిగో (IndiGo) విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించారు.

Published : 05 Aug 2023 13:35 IST

దిల్లీ: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)కు చెందిన విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నిన్నటికి నిన్న ఇంజిన్‌ వైఫల్యం కారణంగా ఓ ఇండిగో విమానం పట్నాలో అత్యవసరంగా దిగగా.. తాజాగా మరో విమానాన్ని దిల్లీ ఎయిర్‌పోర్టులో (Delhi Airport) ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు.

శనివారం ఉదయం 7.40 గంటల ప్రాంతంలో దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓ ఇండిగో విమానం (Delhi-Ranchi Flight) ఝార్ఖండ్‌ రాజధాని రాంచీకి బయల్దేరింది. అయితే టేకాఫ్‌ అయిన కాసేపటికే విమానంలో సాంకేతిక సమస్య (Technical snag) ఎదురైంది. దీంతో గంటలోపే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఉదయం 8.20 గంటలకు ఈ విమానం తిరిగి దిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యింది.

యూట్యూబర్‌ ‘ఫ్రీ గిఫ్ట్‌’లకు ఎగబడ్డ జనం.. రణరంగంగా న్యూయార్క్‌ వీధులు

‘‘విమానంలో సాంకేతిక సమస్య ఎదురైందని, అందుకే దిల్లీ ఎయిర్‌పోర్టుకు మళ్లిస్తున్నామని పైలట్‌ అనౌన్స్‌ చేశారు. ఆ సమయంలో విమానంలో ఓ వైబ్రేషన్‌ వచ్చినట్లు మాకు అనిపించింది. చాలా కంగారుపడ్డాం’’ అని ఓ ప్రయాణికుడు తెలిపారు. దిల్లీలో సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై ఇండిగో స్పందించింది. ప్రయాణికులను మరో విమానంలో రాంచీకి పంపించనున్నట్లు తెలిపింది.

కాగా.. శుక్రవారం ఉదయం కూడా ఓ ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది. బిహార్‌ రాజధాని పట్నా నుంచి దిల్లీకి బయల్దేరిన విమానంలో ఒక ఇంజిన్‌ పనిచేయడం లేదని పైలట్‌ గుర్తించారు. దీంతో టేకాఫ్‌ అయిన మూడు నిమిషాలకే దాన్ని వెనక్కి మళ్లించారు. పట్నాలో అత్యవసరంగా దించేసి ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని