Gita Mittal panel: ‘మణిపుర్‌’పై త్రిసభ్య కమిటీ.. సుప్రీం కోర్టుకు చేరిన మూడు నివేదికలు

మణిపుర్‌ బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ.. సుప్రీం కోర్టుకు మూడు నివేదికలు సమర్పించింది. కమిటీ పనితీరును సులభతరం చేసేందుకు ఆగస్టు 25న ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.

Published : 21 Aug 2023 18:46 IST

దిల్లీ: మణిపుర్‌ హింసాకాండ (Manipur violence) బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణకు ఏర్పాటయిన త్రిసభ్య కమిటీ.. సోమవారం సుప్రీం కోర్టు (Supreme Court)కు మూడు నివేదికలు సమర్పించింది. బాధితులకు పరిహార చెల్లింపు పథకాన్ని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అల్లర్లలో భాగంగా బాధితులు తమ గుర్తింపు పత్రాలను కోల్పోయారని, వాటిని మళ్లీ జారీ చేయాలని సూచించింది. దీంతోపాటు కమిటీకి సాయంగా నిపుణులను నియమించాలని కోరింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం.. కమిటీ పనితీరును సులభతరం చేసేందుకు ఆగస్టు 25న ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.

‘కమిటీ సమర్పించిన మూడు నివేదికలు.. మణిపుర్‌ బాధితులకు అవసరమైన దస్త్రాలను తిరిగి జారీ చేయాలని, పరిహార పథకాన్ని అప్‌గ్రేడ్ చేయాలని, కమిటీకి సాయంగా డొమైన్‌ నిపుణులను నియమించాలని సూచిస్తున్నాయి’ అని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నివేదికల ప్రతులను సంబంధిత న్యాయవాదులందరికీ అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు మణిపుర్‌ బాధితుల్లో ఒకరి తరఫు వాదిస్తోన్న న్యాయవాది బృందా గ్రోవర్‌.. ఈ కమిటీతో తగిన సంప్రదింపులు జరిపి సూచనలను క్రోడీకరించాలని ఆదేశించింది.

20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న అవినీతి కేసులు ఎన్నంటే..?

ఇదిలా ఉండగా.. మణిపుర్‌ బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు.. ముగ్గురు మహిళా మాజీ న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య కమిటీని సుప్రీం కోర్టు నియమించిన విషయం తెలిసిందే. జమ్మూ- కశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిత్తల్ నేతృత్వంలోని ఈ కమిటీలో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ షాలిని పీ జోషి, దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆశా మేనన్ సభ్యులుగా ఉన్నారు. మణిపుర్‌ హింసాకాండకు సంబంధించి సుప్రీం కోర్టు ప్రస్తుతం దాదాపు 10 పిటిషన్‌లను విచారిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు