Indigo: బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌.. విమానాశ్రయంలో హై అలర్ట్‌

కొచ్చి నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేసి బెదిరించాడు.

Updated : 28 Aug 2023 16:08 IST

కొచ్చి: కేరళలోని కొచ్చి (Kochi) నుంచి బెంగళూరు (Bengaluru) వెళ్లాల్సిన ఇండిగో విమానంలో (Indigo Flight) బాంబు ఉందంటూ టేకాఫ్‌ అవ్వడానికి కొన్ని క్షణాల ముందు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి బెదిరించాడు దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఓ శిశువు సహా 139 మంది ప్రయాణికులను అప్పటికప్పుడు కిందికి దింపేశారు. కొచ్చి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెట్‌ (CIAL) వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 10.30 సమయంలో కొచ్చి నుంచి బెంగళూరుకు 6E6482 విమానం టేకాఫ్‌ అవ్వాల్సి ఉంది. ప్రయాణికులను ఎక్కించుకుని గాల్లోకి ఎగిరేందుకు అది సిద్ధంగా ఉంది. అంతలోనే విమానాశ్రయంలోని సీఐఎస్ఎఫ్‌ కంట్రోల్‌ రూమ్‌కి గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఫోన్‌ చేసి ఆ విమానంలో బాంబు ఉన్నట్లు చెప్పాడు. 

పోలీసులు కళ్లుగప్పి.. జైలు గోడపై నుంచి దూకేసి.. చివరికి!

అప్రమత్తమైన రక్షణ సిబ్బంది.. విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించి టేకాఫ్‌ను నిలిపివేశారు. సీఐఎస్‌ఎఫ్‌ అత్యవసర ప్రతిస్పందన బృందాలు, బాంబ్‌ స్వ్కాడ్‌, కేరళ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రయాణికులందర్నీ కిందకి దింపేసి, వారి బ్యాగులు క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబు స్క్వాడ్‌తో విమానం మొత్తం చెక్‌ చేశారు. అయితే, ఎలాంటి అనుమానాస్పద ఆనవాళ్లు లభించలేదు. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు తిరిగి సాయంత్రం 2.24 ప్రాంతంలో విమానం టేకాఫ్‌ అయ్యేందుకు అనుమతించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం ఆరా తీస్తున్నారు. అయితే, నిందితుడు ఇంటర్నెట్‌ కాల్‌ చేయడంతో అది ఏ ఐపీ నుంచి వచ్చిందన్న దానిని గుర్తించే పనిలో ఉన్నారు. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో విమానాశ్రయంలో హై అలర్ట్‌ ప్రకటించారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో విస్త్రృత తనిఖీలు చేపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని