No Confidence Motion: ప్రభుత్వంపై విపక్షాల అవిశ్వాస తీర్మానం.. అనుమతించిన స్పీకర్‌

కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని(No Confidence Motion) లోక్‌సభ స్పీకర్‌ అనుమతించారు. అన్ని పార్టీలతో మాట్లాడి తదుపరి విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. 

Updated : 26 Jul 2023 13:49 IST

దిల్లీ: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కోనుంది. బుధవారం ఉదయం విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన (No Confidence Motion) నోటీసులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తాజాగా అనుమతించారు. ‘దీనిపై నేను అన్ని పార్టీలతో చర్చిస్తాను. ఆ తర్వాత చర్చకు సమయం ప్రకటిస్తాను’ అని స్పీకర్ వెల్లడించారు.

మణిపుర్‌ అంశం (Manipur)పై పార్లమెంటులో ప్రధాని మోదీ (PM Modi) ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి ‘ఇండియా (INDIA)’.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం (No Confidence Motion) ప్రవేశపెడితే.. ప్రధాని మోదీ మాట్లాడటంతో పాటు తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందనే యోచనతో విపక్ష కూటమి ఈ అడుగువేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్పీకర్‌కు కాంగ్రెస్‌, భారాస నోటీసులు సమర్పించాయి. ఈ నోటీసులను పరిశీలించిన ఓం బిర్లా.. తీర్మానానికి అనుమతించారు.

‘అవిశ్వాసాన్ని’ ఆనాడే ఊహించిన మోదీ.. నాలుగేళ్ల నాటి వీడియో వైరల్‌

మణిపుర్ అంశంపై వాయిదా పడిన సభ 12 గంటలకు తిరిగి ప్రారంభమైంది. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా అనుమతితో కాంగ్రెస్‌ డిప్యూటీ నేత గౌరవ్ గొగొయ్‌.. ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఈ తీర్మానంపై చర్చించేందుకు ఎంతమంది మద్దతు ఇస్తున్నారని స్పీకర్ సభ్యులను అడిగారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సహా పలువురు విపక్ష నేతలు తమ మద్దతు ప్రకటిస్తూ లేచి నిల్చున్నారు. చర్చకు అవసరమైన మద్దతు లభించడంతో ఈ తీర్మానాన్ని స్పీకర్ అనుమతించారు. దీనిపై అన్ని పార్టీలతో చర్చించి తేదీ, సమయం ప్రకటిస్తానని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. మణిపుర్ అంశంపై పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూనే ఉంది. ఇదే విషయంపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టడంతో మరోసారి దిగువ సభ వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. రాజ్యసభ కూడా మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు