Modi: ‘అవిశ్వాసాన్ని’ ఆనాడే ఊహించిన మోదీ.. నాలుగేళ్ల నాటి వీడియో వైరల్‌

No-confidence motion: కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్, భారాస నోటిసులిచ్చింది. అయితే ఈ తీర్మానాన్ని ప్రధాని మోదీ 2019లోనే ఊహించారు.

Updated : 26 Jul 2023 12:29 IST

దిల్లీ: మణిపుర్‌ అల్లర్ల (Manipur Issue) అంశంపై పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi)తో ఎలాగైనా మాట్లాడించాలని ప్రయత్నాలు చేస్తున్న విపక్ష కూటమి ‘ఇండియా’ తాజాగా అవిశ్వాస తీర్మాన (No-confidence motion) అస్త్రంతో సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్‌ (Congress), భారాస (BRS) బుధవారం స్పీకర్‌కు నోటీసులిచ్చాయి. అయితే, ఈ ‘అవిశ్వాసాన్ని’ ప్రధాని మోదీ నాలుగేళ్ల క్రితమే ఊహించారు. ఇందుకు సంబంధించిన పాత వీడియో ఒకటి తాజాగా బయటికొచ్చింది.

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్‌, భారాస

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో మోదీ దీని గురించి ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ.. ‘‘2023లోనూ నాపై అవిశ్వాసం తీసుకొచ్చేలా మీకు అవకాశం రావాలి. అందుకు మీరు సిద్ధమవ్వాలని కోరుకుంటున్నా’’ అని మోదీ అనడంతో అధికార పక్ష సభ్యులు నవ్వులు చిందించారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని ఎద్దేవా చేస్తూ నాడు మోదీ ఇలా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

‘‘ఒకప్పుడు లోక్‌సభలో 400కు పైగా స్థానాలు సాధించిన కాంగ్రెస్‌ 2014లో దాదాపు 40 స్థానాలకు పరిమితమైంది. వారి అహంకారం వల్ల జరిగిన పరిణామం అది. కానీ, మా సేవాభావం వల్లే భాజపా రెండు స్థానాల నుంచి ఒంటరిగా అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగింది’’ అని మోదీ ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. తాజాగా, మణిపుర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల కూటమి అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవడంతో ఆ వీడియోను దూరదర్శన్‌ (డీడీ న్యూస్‌) ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

మెజార్టీ లేకున్నా ‘అవిశ్వాసం’.. ఇప్పటివరకు ఎన్నిసార్లు..?

ఇక, ఎన్డీయే సర్కారుపై 2018లో అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అప్పుడు ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని