Manipur: తిరుగుబాటు దళంతో త్వరలోనే శాంతి ఒప్పందం! మణిపుర్‌ సీఎం

ఓ తిరుగుబాటు దళంతో తమ ప్రభుత్వం శాంతి చర్చలు జరుపుతోందని మణిపుర్‌ సీఎం బీరెన్‌ సింగ్‌ ఓ వార్తాసంస్థతో తెలిపారు.

Published : 26 Nov 2023 15:28 IST

ఇంఫాల్‌: జాతుల మధ్య వైరంతో మణిపుర్‌ (Manipur) అట్టుడికిపోయిన విషయం తెలిసిందే. స్థానికంగా పరిస్థితులు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ పరిణామాల నడుమ ముఖ్యమంత్రి ఎన్‌.బీరెన్‌ సింగ్‌ (Biren Singh) కీలక విషయం వెల్లడించారు. ఇంఫాల్ లోయకు చెందిన ఓ తిరుగుబాటు బృందంతో తమ ప్రభుత్వం శాంతి చర్చలు (Peace Talks) జరుపుతోందని ఓ వార్తాసంస్థతో తెలిపారు. అయితే.. ఆ గ్రూపు పేరు వెల్లడించలేదు. చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశిస్తున్నామన్నారు.  మే 3న మణిపుర్‌లో హింస (Manipur Violence) చెలరేగినప్పటినుంచి.. ప్రభుత్వ ఆధ్వర్యంలో శాంతి చర్చల గురించి అధికారికంగా ధ్రువీకరించడం ఇదే మొదటిసారి. నిషేధిత యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF)లోని ఒక వర్గంతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

ఆ ఆయుధాలు ఇంకా వారి చేతుల్లోనే: ఆర్మీ ఉన్నతాధికారి

తమను ఎస్టీల్లో చేర్చాలన్న మైతేయ్‌ల డిమాండ్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ‘గిరిజన సంఘీభావ యాత్ర’ అనంతరం మణిపుర్‌లో హింసాకాండ మొదలైంది. కొన్నినెలలపాటు ఇది కొనసాగింది. జాతుల మధ్య పరస్పర దాడులు, ఇళ్లకు నిప్పుపెట్టడం, ఆయుధాల లూటీ వంటివి చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు 180 మందికిపైగా మరణించారు. అయితే.. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న ప్రయత్నాలతో ప్రస్తుతం ఘర్షణలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరోవైపు ఆయా హింసాత్మక ఘటనలపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. మణిపుర్ జనాభాలో మైతేయ్‌లు దాదాపు 53 శాతం ఉన్నారు. వారంతా ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. 40 శాతంగా ఉన్న నాగాలు, కుకీలు ఇతర తెగలు.. పర్వత ప్రాంతాలకు పరిమితమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని