Milind Deora: శివసేనలో చేరిన మిలింద్‌ దేవ్‌రా

కాంగ్రెస్‌ పార్టీని వీడిన కేంద్ర మాజీ మంత్రి మిలింద్‌ దేవ్‌రా (Milind Deora) సీఎం ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన (Shiv Sena)లో చేరిపోయారు.

Published : 14 Jan 2024 19:01 IST

ముంబయి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేంద్ర మాజీ మంత్రి మిలింద్‌ దేవ్‌రా (Milind Deora) కాంగ్రెస్‌ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని ప్రకటించిన కొన్ని గంటలకే ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన (Shiv Sena)లో చేరిపోయారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసం ‘వర్షా’లో శిందేతో భేటీ అయిన దేవ్‌రా.. ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు తన నివాసం దగ్గర మీడియాతో మిలింద్‌ మాట్లాడుతూ.. అభివృద్ధి పథంలో నడిచేందుకు వెళ్తున్నానని చెప్పారు.

మహారాష్ట్రలో కాంగ్రెస్‌-శివసేన (యూబీటీ) కూటమిలో (Maha Vikas Aghadi) భాగంగా దక్షిణ ముంబయి లోక్‌సభ స్థానంపై చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉద్ధవ్‌ వర్గానికి సీటు కేటాయిస్తే టికెట్‌ దక్కడం కష్టమనే భయాలు మిలింద్‌లో నెలకొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ను వీడి శివసేనలో చేరతారనే ప్రచారం జరిగింది. ఇదే విషయంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ దక్షిణ ముంబయి లోక్‌సభ స్థానం విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేదన్నారు. ఠాక్రే వర్గానికి చెందిన అరవింద్‌ సావంత్‌ అక్కడినుంచే రెండుసార్లు ఎన్నికయ్యారని.. మూడోసారి పోటీ చేయడంలో తప్పేంటని ప్రశ్నించారు. భాజపాకు సొంత బలం లేదంటూ ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే విమర్శలు గుప్పించారు.

ఇదిలాఉంటే, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మురళీ దేవ్‌రా కుమారుడు మిలింద్‌.. పార్టీలో శక్తిమంతమైన నాయకుల్లో ఒకరిగా కొనసాగారు. దక్షిణ ముంబయి లోక్‌సభ స్థానం నుంచి 2004, 2009లో విజయం సాధించిన ఆయన.. 2012లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014, 2019లో శివసేన నేత అరవింద్‌ సావంత్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ అగ్రనేత నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభమైన రోజే మిలింద్‌ పార్టీని వీడటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని