NarendraModi: వెంకయ్యలోని ఉత్సాహం నాకెప్పుడూ ఒక అద్భుతమే: మోదీ

దేశ ప్రజలకు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. శుక్రవారం ఉప రాష్ట్రపతి 73వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు ఫోన్‌లో మోదీ

Updated : 02 Jul 2022 07:23 IST

ఉప రాష్ట్రపతి 73వ జన్మదినం సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు

ఈనాడు, దిల్లీ:  దేశ ప్రజలకు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. శుక్రవారం ఉప రాష్ట్రపతి 73వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు ఫోన్‌లో మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దీంతోపాటు దేశానికి ఉప రాష్ట్రపతి చేసిన సేవలను  ట్విటర్‌లో కొనియాడారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు ఉప రాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మోదీ ట్విటర్‌లో స్పందిస్తూ..‘‘దశాబ్దాలుగా వెంకయ్య నాయుడు దేశానికి ఉన్నత సేవలందించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమం విషయంలో ఆయనకున్న మక్కువ ఎనలేనిది. ఆయనతో గత కొన్నేళ్లుగా సన్నిహితంగా పని చేసే అవకాశం నాకు దక్కింది. ఆయనలోని ఉత్సాహం, శక్తి నాకెప్పుడూ అద్భుతంగా అనిపిస్తాయి. ఉప రాష్ట్రపతిగా ఆయన పార్లమెంటరీ కార్యక్రమాలు, చర్చల ప్రమాణాలను పెంచడంలో కీలక పాత్ర పోషించారు. ఆయనకు దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఈ సందేశంపై ఉప రాష్ట్రపతి స్పందిస్తూ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. ఫోన్‌ చేసి శుభాకామనలు తెలిపినందుకు కృతజ్ఞతలు’’ అని వెంకయ్య నాయుడు ట్వీట్‌ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ లేఖ రాశారు. ‘‘వెంకయ్య నాయుడు వివేకం, చమత్కారం, హాస్యం ఎనలేనివి. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో సుదీర్ఘ జీవితం గడపాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. వెంకయ్య నాయుడుకు హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉప రాష్ట్రపతితో ఫోన్‌లో మాట్లాడిన గవర్నర్‌ ఆయనకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినవారందరికీ ఉప రాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని