Updated : 05 Jun 2021 11:28 IST

అధ్యక్షుడి ట్వీట్‌ తొలగింపు..ట్విటర్‌పై వేటు!

నైజీరియా: ట్విటర్‌పై నైజీరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్విటర్‌ కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ ట్వీట్‌ను తొలగించిన రెండు రోజుల తర్వాత అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లోనూ ట్విటర్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు ముదిరిన విషయం తెలిసిందే.

నైజీరియాలో చెలరేగుతున్న అంతర్గత ఘర్షణలు ఉద్దేశిస్తూ.. అధ్యక్షుడు బుహారీ నిరసనకారులను ట్విటర్‌ మాధ్యమం ద్వారా ఘాటుగా హెచ్చరించారు. 1967-1970 మధ్య కాలంలో 30 నెలల పాటు చెలరేగిన పౌర యుద్ధం వల్ల తలెత్తిన పరిణామాలు తప్పవని గుర్తుచేశారు. ప్రభుత్వాన్ని కూలదోయాలని కుట్ర పన్నుతున్న వారు వెంటనే ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని హెచ్చరించారు. అధ్యక్షుడి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

దీనిపై స్పందించిన ట్విటర్‌ వివాదాస్పదమైన అధ్యక్షుడి ట్వీట్‌ను తొలగించింది. ట్విటర్‌ చర్యను అక్కడి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దేశంలో శాంతి పరిరక్షణ కోసం అధ్యక్షుడు చేస్తున్న కృషికి ట్విటర్‌ అడ్డుతగులుతోందని ఆరోపించింది. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్న అసాంఘిక శక్తులకు మద్దతుగా నిలుస్తోందని వ్యాఖ్యానించింది.

తూర్పు నైజీరియా ప్రాంతాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని కోరుతూ కనూ అనే నేత నాయకత్వంలో ‘ఇండీజినస్ పీపుల్‌ ఆఫ్‌ బయాఫ్రా(ఐపీఓబీ)’ నిరసనలు కొనసాగిస్తోంది. దీనిపై రెఫరెండం నిర్వహించాలని డిమాండ్‌ చేస్తోంది. వీటిని ఉద్దేశిస్తూ అధ్యక్షుడు తాజా ట్వీట్లు చేశారు.

భారత్‌లోనూ కేంద్ర ప్రభుత్వం, ట్విటర్‌ మధ్య విభేదాలు ముదిరిన విషయం తెలిసిందే. నూతన డిజిటల్‌ నిబంధనల ప్రకారం సామాజిక మాధ్యమాలన్నీ తమ అధికారుల వివరాలను తెలియజేయాలని ఐటీశాఖ ఆదేశించగా.. గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, కూ, షేర్‌చాట్‌, టెలిగ్రాం, లింక్‌డిన్‌ తదితర వేదికలు నిర్దేశిత వివరాలను ప్రభుత్వానికి వెల్లడించాయి. ట్విటర్‌ మాత్రం ఈ నిబంధనలను పాటించడం లేదని ప్రభుత్వ వర్గాలు గత శుక్రవారం పేర్కొన్నాయి. అంతకుముందు భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా చేసిన ఓ ట్వీట్‌కు.. ‘కల్పిత మీడియా’ అంటూ ట్విటర్‌ ట్యాగ్‌ను జోడించడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సంస్థ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందంటూ ఆక్షేపించింది. వెంటనే ట్యాగ్‌ను తొలగించాలంటూ ఘాటు లేఖ రాసింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని