Tesla: టెస్లాకు వెల్‌కం.. కానీ, ఆ సంస్థ అలా చేయడం బాగోదు: గడ్కరీ

ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ కంపెనీ టెస్లా భారత్‌లోకి ......

Updated : 26 Apr 2022 16:44 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ కంపెనీ టెస్లా భారత్‌లోకి ప్రవేశించేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. కాకపోతే మన దగ్గర ఉత్పత్తి చేయకుండా దిగుమతి చేసుకున్న కార్లను మన దగ్గర విక్రయిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్లా కంపెనీ భారత్‌లో కార్లు తయారు చేసి ఇక్కడి నుంచే ఉత్పత్తి చేసి బయటి దేశాలకు ఎగుమతులు చేస్తే బాగుంటుందన్నారు. కానీ చైనా నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తామనుకోవడం మంచి ప్రతిపాదన కాదని అభిప్రాయపడ్డారు. మంగళవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ.. ‘‘టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ భారత్‌లో కార్ల తయారీకి సిద్ధమైతే అందుకు కావాల్సిన సామర్థ్యాలు, సాంకేతికత మన వద్ద ఉన్నాయి. కాకపోతే భారత్‌లోనే ఉత్పత్తి చేయాలని కోరుతున్నాం. కానీ, ఆయన చైనాలో తయారు చేసిన కార్లను ఇక్కడ విక్రయించాలనుకుంటే అది సరైన ప్రతిపాదన కాదు’’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు. భారత్‌ అతి పెద్ద మార్కెట్‌ అనీ.. అన్ని రకాల ఎలక్ట్రికల్‌ వాహనాలకూ ఇక్కడ అవకాశం ఉంటుందని చెప్పారు. 

జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విపణి కలిగిన భారత్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా గత కొంత కాలంగా తహతహలాడుతున్న విషయం తెలిసిందే. అయితే, తొలుత విదేశాల్లో తయారైన తమ కార్లను భారత్‌లో విక్రయిస్తామనీ.. తర్వాతే స్థానికంగా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని ఆ సంస్థ అధినేత మస్క్‌ చెబుతున్నారు. అంతకంటే ముందు కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలంటూ గత ఏడాది కాలంగా దిల్లీలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ.. భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి సరైన ప్రణాళికను ఆ సంస్థ ప్రకటించకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడంలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని