Sky bus: స్కైబస్‌లో కేంద్రమంత్రి గడ్కరీ టెస్టు రైడ్‌.. త్వరలో ఆ బస్సులు భారత్‌కు!

చెక్‌ రిపబ్లిక్‌ (Czech Republic) రాజధాని ప్రేగ్‌లో (Prague) నిర్వహించిన 27వ వరల్డ్ రోడ్ కాంగ్రెస్‌లో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో ఆయన షార్జా వెళ్లారు. 

Updated : 04 Oct 2023 16:40 IST

Image: Nitin Gadkari

ఇంటర్నెట్‌ డెస్క్ : షార్జాలోని ‘పైలట్‌ సర్టిఫికేషన్‌ అండ్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ యూస్కై టెక్నాలజీ’ని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్కై బస్‌లో (Sky bus) టెస్టు రైడ్ చేశారు. ఆ అధునాతన బస్‌లో ఉన్న భద్రతా సదుపాయాలు సహా నిష్క్రమణ డెమోనూ సాంకేతిక నిపుణులు ఆయనకు వివరించారు. ‘యూస్కై టెక్నాలజీ స్కై బస్‌ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసింది. ఈ మొబిలిటీ సర్వీసును భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ఐస్కై మొబిలిటీ యూస్కైతో చేతులు కలిపిందని’ ఆయన ట్వీట్‌లో ప్రకటించారు. ఆ ఒప్పందం అమలైతే త్వరలో భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఈ స్కైబస్‌లు పరుగులు తీయనున్నాయి. దాంతో ప్రయాణికులకు భద్రత లభించడంతోపాటు, వారి సమయం ఆదా కానుంది. 

వందే భారత్‌లో స్లీపర్‌ కోచ్‌లు.. ఫొటోలు షేర్‌ చేసిన కేంద్ర మంత్రి

స్కైబస్‌ స్థిరమైన, రద్దీలేని అర్బన్‌ మొబిలిటీ సొల్యూషన్‌ను అందిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. ఈ రవాణా మార్గం అందుబాటులో వస్తే కాలుష్యంతోపాటు.. ట్రాఫిక్‌ తగ్గుముఖం పడుతుందని అన్నారు. అర్బన్‌ ప్రాంత ప్రజలకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. దీనిని నిర్మించేందుకు రైల్ కేబుల్ సిస్టమ్‌ను వినియోగించడం వల్ల భూ సేకరణ అవసరం ఎక్కువగా ఉండదని పేర్కొన్నారు. దేశ రవాణా మౌలిక సదుపాయాల్లో ఇది ఎంతో కీలకం కానుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

యూస్కై తెలిపిన వివరాల ప్రకారం ఈ స్కై బస్‌లు నేలపై కాకుండా గాల్లో ప్రయాణిస్తాయి. చూడటానికి అవి మెట్రో రైళ్లు కిందికి వేలాడుతూ ప్రయాణిస్తున్నట్లు కన్పిస్తాయి. దాంతో వేగం, భద్రత పెరుగుతుందని ఆ కంపెనీ చెబుతోంది. పర్యావరణానికి సైతం నష్టం తగ్గుతుందని పేర్కొంది. ఇతర రవాణా వ్యవస్థలతో పోలిస్తే ఈ స్కై బస్‌ల నిర్మాణం, నిర్వహణ చాలా తక్కువని వెల్లడించింది. అక్టోబర్‌ 2న చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రేగ్‌లో నిర్వహించిన 27వ వరల్డ్ రోడ్ కాంగ్రెస్‌లో గడ్కరీ పాల్గొన్నారు. అనంతరం ఆయన అక్కడే హైడ్రోజన్‌ ఫ్యూయల్ బస్సులో ప్రయాణించారు. తాజాగా స్కైబస్‌ ఎక్కి దాని ప్రత్యేకతల గురించి తెలుసుకున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని