Live Surgery: సర్జరీలు ప్రత్యక్షప్రసారం.. ప్రజల అభిప్రాయాలు కోరిన NMC

సర్జరీలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న అంశాన్ని పరిశీలించేందుకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (NMC) ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది.

Published : 25 Jan 2024 18:33 IST

దిల్లీ: శస్త్రచికిత్సలను కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని పరిశీలించేందుకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (NMC) ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. అంతేకాక దీనిపై ఆసుపత్రులు, రోగుల బంధువులు 10 రోజుల్లోగా తమ అభిప్రాయాలు చెప్పాలని పేర్కొంటూ పబ్లిక్‌ నోటీసు జారీ చేసింది.

రోగులకు చేసే ఆపరేషన్లను ప్రత్యక్షంగా చూపిస్తూ అనేక ప్రైవేటు ఆసుపత్రులు వాణిజ్యపరంగా వాడుకుంటున్నాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో గతంలో రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. అందులోని పలు అంశాలను ఎన్‌ఎంసీ ప్రస్తావించింది. రోగుల ఆరోగ్య పరిస్థితులను పక్కనపెట్టి అనేక కంపెనీలు తమను తాము ప్రచారం చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయి. వైద్యవిద్య అవసరాల కోసం ముందుగా రికార్డు చేసి, ఎడిట్‌ చేసిన సర్జికల్‌ వీడియోలను ఉపయోగించుకోవచ్చు అని ఎన్‌ఎంసీ పేర్కొంది.

సర్జరీలను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై న్యాయపరమైన, నైతిక ప్రశ్నలను లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో గతేడాది ఓ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై కేంద్రంతో పాటు ఇతర భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను కోరిన సుప్రీం ధర్మాసనం.. ఈ అంశాన్ని ఎన్‌ఎంసీ పరిశీలనకే వదిలేస్తున్నామని తెలిపింది. ఈనేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకునేందుకు గాను తగిన సిఫార్సులు ఇవ్వడానికి నిపుణుల కమిటీని ఏర్పాటుచేసినట్లు ఎన్‌ఎంసీ పేర్కొంది. దీంతోపాటు ప్రజల అభిప్రాయాలను తెలపాలని కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని