Ukraine Crisis: ఉక్రెయిన్‌లో ‘భారతీయుల బందీ’ వార్తలు.. విదేశాంగ శాఖ ఏమందంటే..

ఉక్రెయిన్‌లో భారత పౌరులు, విద్యార్థులు బందీలుగా ఉన్నారంటూ వస్తోన్న ప్రచారంపై విదేశాంగ శాఖ గురువారం వివరణ ఇచ్చింది. భారత విద్యార్థులు బందీలుగా ఉన్నట్లు తమకు సమాచారం లేదని

Published : 03 Mar 2022 10:56 IST

దిల్లీ: ఉక్రెయిన్‌లో భారత పౌరులు, విద్యార్థులు బందీలుగా ఉన్నారంటూ వస్తోన్న ప్రచారంపై విదేశాంగ శాఖ గురువారం వివరణ ఇచ్చింది. భారత విద్యార్థులు బందీలుగా ఉన్నట్లు తమకు సమాచారం లేదని వెల్లడించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఖార్కివ్‌లో కొందరు భారత విద్యార్థులను ఉక్రెయిన్‌ భద్రతా సిబ్బంది బందీలుగా పట్టుకొన్నట్లు రష్యా నిన్న ఆరోపించింది. ఈ ప్రచారంపై నేడు ఎంఈఏ స్పందించింది. ‘‘ఉక్రెయిన్‌లోని మన ఎంబసీ భారత పౌరులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తోంది. ఉక్రెయిన్‌ అధికారుల సహకారంతో నిన్న చాలా మంది విద్యార్థులు ఖార్కివ్‌ నుంచి బయల్దేరారు. భారత విద్యార్థులను బందీలుగా తీసుకున్నట్లు మాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఖార్కివ్‌లో చిక్కుకున్న పౌరులు పశ్చిమ సరిహద్దులకు చేరేలా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని ఉక్రెయిన్‌ అధికారులను కోరాం’’ అని బాగ్చీ ట్విటర్‌లో వెల్లడించారు.

గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌ నుంచి వేలాది మంది భారతీయులను స్వదేశానికి తీసుకురాగలిగామని బాగ్చీ తెలిపారు. ఇందుకు సహకరించిన ఉక్రెయిన్‌, పొరుగు దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. రష్యా దాడులతో ఉక్రెయిన్‌ గగనతలాన్ని మూసివేయడంతో దాని పొరుగు దేశాలైన పోలాండ్‌, రొమేనియా, హంగరీ, స్లోవేకియా, మల్దోవా దేశాల నుంచి భారత పౌరులను తరలిస్తోన్న విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని