Modi: ప్రధాని ప్రసంగం వేళ ఖాళీ కుర్చీ..

స్వాతంత్ర్య దినోత్సవం వేళ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

Updated : 15 Aug 2023 10:09 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు సాగుతున్నాయి. దిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) పాల్గొనలేదు. దాంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆయన పేరుతో ఉన్న కుర్చీ ఖాళీగా కనిపించింది. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఖర్గే ఈ కార్యక్రమానికి రాలేదని కాంగ్రెస్ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖర్గే ఒక సందేశాన్ని పంపారు. ప్రధాని మోదీ(Modi), భాజపాను ఉద్దేశించి విమర్శనాత్మకంగా స్పందించారు.

ఖర్గే తన వీడియో సందేశంలో దేశ ప్రగతి కోసం మాజీ ప్రధానులు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూతోపాటు ఇందిరా గాంధీ, లాల్‌ బహదూర్ శాస్త్రి, రాజీవ్‌ గాంధీ, మన్మోహన్ సింగ్ పేర్లను ప్రస్తావించారు. అంతేగాకుండా భాజపా దివంగత నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరును తన సందేశంలో పేర్కొనడం గమనార్హం.

త్వరలో కొత్త పథకం.. ₹లక్షల్లో ప్రయోజనం: మోదీ

‘ప్రతి ప్రధాని దేశ పురోగతికి తమవంతు సహకారాన్ని అందించారు. అభివృద్ధి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల నుంచే ప్రగతి పథంలో వెళ్తుందని కొందరు వ్యక్తులు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు ప్రమాదంలో ఉన్నాయని ఎంతో బాధతో చెప్తున్నాను. విపక్షాల గొంతు నొక్కేందుకు కొత్త సాధనాలు ఉపయోగిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు ఎన్నికల సంఘాన్ని కూడా బలహీనపరుస్తున్నారు’ అంటూ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని