ఇంట్లో ఇల్లాలు.. విదేశాల్లో ప్రియురాలితో.. కథలో ట్విస్ట్‌ ఇదే!

ఆఫీస్‌ పనిమీద విదేశాలకు వెళుతున్నానని భార్యతో చెప్పిన ఓ వ్యక్తి ప్రియురాలితో విహారయాత్రలు చేశాడు. భార్యకు ఈ విషయం తెలియకుండా ఉండేందుకు........

Published : 10 Jul 2022 01:42 IST

ముంబయి: ఆఫీస్‌ పనిమీద విదేశాలకు వెళ్తున్నానని భార్యతో చెప్పిన ఓ వ్యక్తి ప్రియురాలితో విహారయాత్రలు చేశాడు. మాల్దీవుల్లో షికార్లు కొట్టాడు. భార్యకు ఈ విషయం తెలియకుండా ఉండేందుకు ఓ నేరానికి పాల్పడి అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో అక్రమ సంబంధం విషయం భార్యకు తెలియడంతోపాటు ఆ నేరం కారణంగా కటకటాలపాలయ్యాడు. అసలేం జరిగిందంటే..

ముంబయికి చెందిన 32 ఏళ్ల వ్యక్తి మల్టీనేషనల్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆఫీస్‌ పనిమీద విదేశాలకు వెళ్తున్నానని భార్యతో అబద్ధం చెప్పి ప్రియురాలితో కలిసి మాల్దీవులకు విహారయాత్రలకు వెళ్లాడు. అయితే భార్య ఎన్నిసార్లు కాల్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. వాట్సాప్‌ కాల్‌ చేసినా ఎత్తలేదు. దీంతో భార్యకు అనుమానం వచ్చిందేమోనని కంగారుపడ్డ ఆ టెకీ.. మాల్దీవుల ట్రిప్‌ను దాచేందుకు తన పాస్‌పోర్ట్‌లోని వీసా స్టాంప్‌ పేజీలను చించేశాడు.

పేజీలు లేని పాస్‌పోర్ట్‌తోనే ముంబయి విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే అతని పాస్‌పోర్ట్‌లోని 3-6, 31-34 పేజీలు మిస్సయినట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే మొదట పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో మోసం, ఫోర్జరీ ఆరోపణలపై అతడిని అరెస్టు చేసిన అధికారులు పోలీసులకు అప్పగించారు. ‘ఉద్దేశపూర్వకంగానే పాస్‌పోర్టులోని పేజీలను చించేసి మాల్దీవుల నుంచి భారత్‌కు ప్రయాణించాడు. మోసపూరిత నేరానికి పాల్పడ్డాడు’ అని ఇమ్మిగ్రేషన్ అధికారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నివేదించారు. అయితే ప్రియురాలితో విహారయాత్రల గురించి భార్యకు తెలియకుండా ఉండేందుకు ఈ పని చేసినట్లు చివరకు ఆ వ్యక్తి పోలీసుల వద్ద నిజం ఒప్పుకున్నాడు. భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పోర్ట్‌ను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం నేరపూరిత చర్య అని అతనికి తెలియదని పోలీసులు పేర్కొన్నారు. ఆ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను జైలుకు తరలించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని