ఆ మరణాలకు వ్యాక్సిన్‌ కారణం కాదు!

యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో వ్యాక్సిన్‌ తీసుకున్న వృద్ధుల్లో మరణాలు సంభవించడానికి ఫైజర్‌ టీకాకు ఎటువంటి సంబంధం లేదని ఈయూ నియంత్రణ సంస్థ స్పష్టంచేసింది.

Published : 29 Jan 2021 22:45 IST

ఈయూ నియంత్రణ సంస్థ వెల్లడి

లండన్‌: కరోనా వ్యాక్సిన్ పంపిణీలో ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ముందున్న విషయం తెలిసిందే. అయితే, యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో వ్యాక్సిన్‌ తీసుకున్న వృద్ధుల్లో మరణాలు సంభవించడం ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేసింది. దీనిపై దర్యాప్తు చేసిన యూరోపియన్‌ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) వారి మరణాలకు, ఫైజర్‌ టీకాకు ఎటువంటి సంబంధం లేదని తాజాగా స్పష్టంచేసింది. అంతేకాకుండా వ్యాక్సిన్‌ సురక్షితమైందని మరోసారి తేల్చిచెప్పింది.

‘కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత చనిపోయిన వృద్ధుల నివేదికలను పరీక్షించాం. వ్యాక్సిన్‌ కారణంగా చనిపోయారని తెలిపే ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి దుష్ర్పభావాలు కలగడం లేదు.. సురక్షితమైన వ్యాక్సిన్‌లపై ఎటువంటి ఆందోళన అవసరం లేదు’ అని యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ వెల్లడించింది. అంతేకాకుండా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో కనిపించే అలర్జీ కేసులు కూడా ముందుగా అంచనా వేసిన స్థాయిని దాటలేదని ఈఎంఏ ప్రకటించింది.

ఇక దాదాపు అన్ని దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ చేపట్టిన ఈయూ, ఇప్పటి వరకు ఫైజర్‌, మోడెర్నా టీకాలకు అనుమతి ఇచ్చింది. అయితే, నార్వే, డెన్మార్క్‌, ఫిన్‌లాండ్‌, ఐస్‌లాండ్‌, స్వీడెన్‌ దేశాల్లో ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వృద్ధుల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. కేవలం నార్వేలోనే తొలి డోసు తీసుకున్న వృద్ధుల్లో 33 మంది చనిపోయారు. అయితే, ఇతర ఆరోగ్య కారణాల వల్లే వారు ప్రాణాలు కోల్పోయినట్లు నియంత్రణ సంస్థ తేల్చడంతో పాటు వ్యాక్సిన్‌ సురక్షితమని ప్రకటించింది. ఈ మధ్యే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం చేపట్టిన దర్యాప్తులో ఇదే విషయం వెల్లడైంది.

ఇవీ చదవండి..
ఎట్టకేలకు..మొదలైన కొవిడ్‌ మూలాల శోధన
భారత్‌లో ఒక్కరోజే 5లక్షల మందికి టీకా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని