Bhagwant Mann: ఉద్యోగులకు దీపావళి కానుకగా పంజాబ్‌ సీఎం కీలక ప్రకటన

పంజాబ్‌లో ప్రస్తుతం అమలులో ఉన్న సీపీఎస్‌(CPS) పింఛను పథకం స్థానంలో తిరిగి పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌)ని పునరుద్ధరించాలని పంజాబ్‌ కేబినెట్‌ సూత్రప్రాయ నిర్ణయం తీసుకుందని సీఎం భగవంత్‌ మాన్‌ ప్రకటించారు.

Published : 22 Oct 2022 01:41 IST

చండీగఢ్‌: దీపావళి(Diwali) పండుగ వేళ పంజాబ్‌లోని భగవంత్‌ మాన్‌(Bhagwant Mann) కేబినెట్‌ ఆ రాష్ట్ర ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న సీపీఎస్‌(CPS) పింఛను పథకం స్థానంలో తిరిగి పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌)ని పునరుద్ధరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఉద్యోగులకు దీపావళి కానుకగా పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఈరోజు కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం భగవంత్‌ మాన్‌ ప్రకటించారు. ‘‘ఈరోజు జరిగిన కేబినెట్‌ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంతో లక్షలాది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. పంజాబ్‌లో పాత పింఛను విధానాన్ని తీసుకొస్తున్నాం..’’ అని వెల్లడించారు. 

సీపీఎస్‌ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలంటూ గత కొన్నేళ్లుగా రాష్ట్ర ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే పంజాబ్‌ పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామంటూ పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్‌తో పాటు కాంగ్రెస్‌ నేతలు కూడా హామీ ఇచ్చారు. అదే సమయంలో ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ ఆప్‌ నేత, ప్రస్తుత ఆర్థికమంత్రిగా ఉన్న హర్‌పాల్ సింగ్ చీమా గతేడాది ఆగస్టులో తమ పార్టీ అధికారంలోకి వస్తే పాత పింఛను విధానాన్ని తిరిగి అమలు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని