చర్చలతోనే సమస్యలకు పరిష్కారం: రాజ్‌నాథ్‌

సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులు, కేంద్రం మధ్య చర్చలు జరగాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆకాంక్షించారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన వెల్లడించారు.

Published : 16 Mar 2021 01:27 IST

లఖ్న‌వూ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులు, కేంద్రం మధ్య చర్చలు జరగాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆకాంక్షించారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం లఖ్న‌వూలో నిర్వహించిన పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో వెల్లడించారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేపట్టడం నిరాశకు గురిచేస్తోందన్నారు. సమస్య ఏదైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రాజ్‌నాథ్‌ విజ్ఞప్తి చేశారు.  

‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే భాజపా లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ కనీస మద్దతు ధరకు ముగింపు ఉండదు. మేమందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారమే. వ్యవసాయ రంగంలో అవసరమైన సవరణలు చేసి సమస్యలు పరిష్కరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని రాజ్‌నాథ్‌ తెలిపారు. గతేడాది భారత్‌, చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి మాట్లాడుతూ.. ‘మన ఆర్మీ జవాన్లు ఎంతో ఓపికతో ధైర్య, సాహసాలు ప్రదర్శించారు. మనం ఎవరిపైనా దాడి చేయాలని కోరుకోం. అలాగని మన భూమిని ఆక్రమించుకోవాలని చూస్తే ఎప్పటికీ ఊరుకోం’ అని చెప్పారు. భారత్‌ ప్రపంచంలోనే సూపర్‌ పవర్‌గా ఎదగడాన్ని ఏ శక్తీ ఆపలేదన్న రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. 

పార్టీ గురించి ప్రస్తావిస్తూ.. యూపీలో రాబోయే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా మునుపటికి మించిన స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భాజపా కార్యకర్తగా ఉండే అవకాశం దక్కడం అదృష్టంగా చెప్పుకొచ్చారు. భాజపా కార్యకర్తలు అధికారమే లక్ష్యం కాకుండా.. ఒక స్పష్టమైన రాజకీయ దృక్పథం కలిగి ఉంటారన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత అనేది అతి కీలకమైన అంశమని.. అందుకు ప్రధాని నరేంద్రమోదీని ఉదాహరణగా రాజ్‌నాథ్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని