Manish Sisodia: మనీశ్ సిసోదియాకు మళ్లీ నిరాశే.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు

Manish Sisodia: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్‌ నేత మనీశ్ సిసోదియాకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ కేసులో ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Updated : 30 Oct 2023 15:09 IST

దిల్లీ: మద్యం కుంభకోణం (Delhi excise policy scam case) కేసుల్లో అరెస్టయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్‌ నేత మనీశ్ సిసోదియా (Manish Sisodia)కు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) తిరస్కరించింది. ఈ కేసులో నగదు లావాదేవీలు జరిగినట్లు కొన్ని ఆధారాలున్నాయని దర్యాప్తు సంస్థ చూపించిందని సుప్రీంకోర్టు తెలిపింది.

రూ.338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి ఈడీ కొన్ని ఆధారాలు సమర్పించిందని కోర్టు వెల్లడించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభమైనందున ఈ దశలో బెయిల్‌ ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ కేసు విచారణను 6-8 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఒకవేళ విచారణ నిదానంగా సాగితే.. సిసోదియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

‘ఖతార్‌లో ఉరిశిక్ష పడిన వారిని విడిపిస్తాం’.. బాధిత కుటుంబాలను కలిసిన జైశంకర్‌

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 26న మనీశ్ సిసోదియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మార్చి 9న ఈడీ కూడా సిసోదియాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన కస్టడీపై తిహాడ్‌ జైల్లో ఉన్నారు. ఈ కేసుల్లో బెయిల్‌ కోసం కింది కోర్టుల్లో ఊరట లభించకపోవడంతో సిసోదియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో వేర్వేరుగా బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

దీనిపై ఇటీవల దర్యాప్తు చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. దర్యాప్తు సంస్థలకు పలు ప్రశ్నలు సంధించింది. అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా తాము లేవనెత్తిన చాలా అంశాలకు ఎవరి నుంచి సరైన సమాధానం రాలేదని కోర్టు ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్నింటికి సమాధానం ఇచ్చినా అవి సంతృప్తికరంగా లేవని పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని