Karnataka: మూఢనమ్మకాలకు చెక్‌.. మళ్లీ తెరుచుకున్న సీఎం ఛాంబర్‌ దక్షిణ ద్వారం

వాస్తుపరంగా కలిసి రావడం లేదంటూ గతంలో మూసేసిన సీఎం ఛాంబర్‌ దక్షిణ ద్వారాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా తెరిపించారు.

Published : 24 Jun 2023 23:34 IST

బెంగళూరు: మూఢనమ్మకాలకు తోసిపుచ్చుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీ భవనంలో ఉన్న తన ఛాంబర్‌ దక్షిణ ద్వారాన్ని తెరిపించారు. అప్పటి ముఖ్యమంత్రి హెచ్‌జే పాటిల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. వాస్తుపరంగా కలిసిరావడం లేదంటూ 1998లో ఈ ద్వారాన్ని మూసివేశారు. దాదాపు 15 ఏళ్లపాటు తెరవలేదు. 2013లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత దానిని మళ్లీ తెరిచారు. ఐదేళ్ల పాటు తెరచుకున్న ద్వారం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడంతో మళ్లీ మూతపడింది. ఈ ఎన్నికల్లో  భాజపా అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రులుగా ఉన్న భాజపా నాయకులు బీఎస్‌ యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, హెచ్‌డీ కుమారస్వామి (జేడీఎస్‌) మాత్రం ఆ ద్వారాన్ని ఉపయోగించేందుకు నిరాకరించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించగా.. అధిష్ఠానం మళ్లీ సిద్ధరామయ్యకే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో గతంలో మూసేసిన దక్షిణ ద్వారాన్ని ఆయన మళ్లీ తెరిపించారు. విధాన సౌధలోని మూడో అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్‌ ఉంటుంది. దానికి దక్షిణ, పశ్చిమ దిశల్లో ద్వారాలు ఉంటాయి. అయితే, దక్షిణ ద్వారాన్ని ఉపయోగించేందుకు ఎమ్మెల్యేలు సైతం ఇష్టపడరు. దానికి బదులుగా పశ్చిమద్వారం నుంచే లోపలికి వెళ్తారు. దక్షిణ ద్వారాన్ని వాస్తు ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించలేదని చెబుతుంటారు. తాజా సీఎం ఆ మూఢ నమ్మకాలకు స్వస్తి పలుకుతూ దక్షిణ ద్వారాన్ని తెరిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని