Children Vaccine: 5-12 ఏళ్ల పిల్లలకు త్వరలోనే టీకా..?

5 నుంచి 12 ఏళ్ల పిల్లల కోసం రూపొందించిన కార్బెవాక్స్‌, కొవాగ్జిన్‌ వినియోగ అనుమతులపై నిర్ణయం తీసుకునేందుకు సబ్జెక్టు నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) గురువారం భేటీ అయ్యింది.

Published : 22 Apr 2022 01:17 IST

కార్బెవాక్స్‌, కొవాగ్జిన్‌ చిన్నారుల టీకాలపై నిపుణుల కమిటీ భేటీ

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి మళ్లీ మొదలవుతున్న వేళ వ్యాక్సిన్‌ పంపిణీని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే యువకులకు వ్యాక్సిన్‌ పంపిణీ మొదలుపెట్టిన ప్రభుత్వం.. చిన్నారులకూ కరోనా వ్యాక్సిన్‌ను అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో 5 నుంచి 12 ఏళ్ల పిల్లల కోసం రూపొందించిన కార్బెవాక్స్‌, రెండేళ్ల చిన్నారుల కోసం తయారుచేసిన కొవాగ్జిన్‌ వినియోగంపై నిర్ణయం తీసుకునేందుకు నిపుణుల కమిటీ గురువారం భేటీ అయ్యింది. వీటి ఫలితాలను విశ్లేషించిన అనంతరం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI)కు సిఫార్సు చేయనుంది.

హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఇ తయారు చేసిన కార్బెవాక్స్‌ టీకా వినియోగం అనుమతి కోసం ఆ సంస్థ ఇదివరకే దరఖాస్తు చేసుకొంది. ఈ వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలను విశ్లేషించేందుకు సబ్జెక్టు నిపుణుల కమిటీ (SEC) గురువారం భేటీ అయ్యింది. వాటిని పరిశీలించిన ఎస్‌ఈసీ, వ్యాక్సిన్‌ వినియోగానికి డీసీజీఐకు సిఫార్సు చేసినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు చిన్నారుల కోసం భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా వినియోగ అనుమతి కోరుతూ ఆ సంస్థ కూడా గతంలో దరఖాస్తు చేసుకుంది. ఈ ఫలితాలను కూడా గురువారం నాటి భేటీలో సబ్జెక్టు నిపుణుల కమిటీ విశ్లేషించినట్లు సమాచారం. ఒకవేళ వీటి వినియోగానికి ఎస్‌ఈసీ సిఫార్సు చేస్తే మాత్రం చిన్నారుల టీకా పంపిణీపై కేంద్ర ఆరోగ్యశాఖ అతి త్వరలో తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, దేశంలో 12 ఏళ్ల వయసు పైబడిన పిల్లల కోసం ప్రస్తుతం రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ టీకాను 15 నుంచి 18 ఏళ్ల వయసువారికి పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటులోనూ ఇది అందుబాటులో ఉంది. 12-14 ఏళ్ల పిల్లలకు ఇస్తున్న కార్బెవాక్స్‌ మాత్రం ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లోనే ఉందుబాటులో ఉంది. తాజాగా దేశంలో కరోనా ఉద్ధృతి మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో ఐదేళ్ల చిన్నారులకు వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని