Education: ఎంత ఎక్కువ చదివితే అంత ఆదాయం

ఉన్నత విద్యావంతుల్ని సంతోషపెట్టే విషయమిది. భారత్‌లో ఎంత ఎక్కువ చదువుకుంటే సంపాదన అంతగా పెరుగుతోందని ‘పాపులేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’ అనే ఎన్జీవో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. యువ

Updated : 24 Sep 2022 15:45 IST

దిల్లీ: ఉన్నత విద్యావంతుల్ని సంతోషపెట్టే విషయమిది. భారత్‌లో ఎంత ఎక్కువ చదువుకుంటే సంపాదన అంతగా పెరుగుతోందని ‘పాపులేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’ అనే ఎన్జీవో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. యువ జనాభా ఆరోగ్యం, విద్య, సంక్షేమంపై ప్రభుత్వం ఎందుకు పెట్టుబడులు పెట్టాలో వివరించింది. ఈ నివేదికను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ వివేక్‌ దెబ్రాయ్‌ సోమవారం విడుదల చేశారు. ప్రతి అదనపు విద్యా సంవత్సరం.. వ్యక్తి సగటు ఆదాయాన్ని సుమారు 6.7% పెంచుతున్నట్టు ఈ అధ్యయనం పేర్కొంది. ఈ రాబడి అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కువగా ఉంటోంది. అదనంగా చదివే ప్రతి సంవత్సరం.. మహిళల నెలవారీ జీతాన్ని 8.6% పెంచుతుంటే, పురుషులకు 6.1% మేర పెరుగుతోంది. పాఠశాల విద్యపై పెట్టే ప్రతి రూపాయికి.. భవిష్యత్తులో ఒక్కో వ్యక్తికి రూ.4.5- రూ.8.2 మేర ఆర్థిక ప్రయోజనాల రూపంలో ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఆరేళ్లలో కౌమార దశలో ఉన్నవారి మానసిక ఆరోగ్యం పెంచే వసతుల కల్పనకు రూ.8,134 కోట్లు ఖర్చవుతుందని కూడా ఈ అధ్యయనం తెలిపింది. అలాగే మానసిక రుగ్మతల చికిత్సకు రూ.2,745 కోట్ల వ్యయమవుతుందని చెప్పింది. యుక్తవయస్కులు ఎదుర్కొనే మానసిక సమస్యలే మున్ముందు ప్రధాన సమస్య అవుతుందని వివేక్‌ దెబ్రాయ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని