Goa: కిటకిటలాడిన గోవా వీధులు.. కొవిడ్ వేవ్‌ను ఘనంగా ఆహ్వానిస్తోన్న ప్రజలు..!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వారం వ్యవధిలో ఐదు రెట్లు పెరిగింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 1700కి చేరాయి.

Updated : 03 Jan 2022 20:06 IST

వీడియో వైరల్‌.. నెటిజన్ల విమర్శలు

పనాజీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వారం వ్యవధిలో ఐదు రెట్లు పెరిగింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 1700కి చేరాయి. ఇలా దేశంలో మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. దీనికి న్యూ ఇయర్ వేడుకలు మరింత ఆజ్యం పోస్తున్నాయన్నది వాస్తవం. త్వరలోనే ఆ ప్రభావం మరింతగా కనిపించనుందని నిపుణులు అంటున్నారు. అందుకు తగ్గ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ పండగ సీజన్‌లో గోవా వీధుల్లో బాగా బీచ్‌ సమీపంలో తీసిన ఆ వీడియోలో.. ఇసుకేస్తే రాలనంత రద్దీ కనిపించింది. ఆ కిక్కిరిసిన జనంలో కొవిడ్ నియమాలు గాల్లో కలిశాయి. కొత్త సంవత్సరం కావడంతో సేద తీరేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అక్కడి అధికారులు వెల్లడించారు. 

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తుండగా..గోవా ప్రభుత్వం ఇప్పటికే కఠిన ఆంక్షలు జారీ చేసింది. టీకా ధ్రువపత్రం, నెగెటివ్ ఆర్టీపీసీఆర్ నివేదిక ఉంటేనే ప్రజల్ని అనుమతించాలని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాసినోలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షల మధ్యనే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు వేల సంఖ్యలో ప్రజలు బీచ్‌లు, నైట్‌క్లబ్స్, పబ్స్‌కు తరలివచ్చారు. దానిలో భాగంగా బాగా బీచ్‌ సమీపంలో జనాలు కిటకిటలాడారు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్‌ కాగా.. కొవిడ్ వేవ్‌ను ఘనంగా స్వాగతిస్తున్నారంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఈ కొవిడ్ పరిస్థితుల్ని తేలిగ్గా తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ వచ్చినా ఈ స్థాయిలో పర్యటించేందుకు అనుమతులు ఎలా ఇచ్చారంటూ స్థానిక ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

24 గంటల వ్యవధిలో గోవాలో 388 కొత్త కేసులు వచ్చాయి. ప్రస్తుతం ఒక్క ఒమిక్రాన్ కేసు మాత్రమే ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ వేడుకల సీజన్‌తో సోమవారం అక్కడ కొవిడ్ పాజిటివిటీ రేటు 10.7 శాతానికి చేరింది. మొత్తం కేసులు 1.8లక్షలు దాటగా.. 3,253 మంది మరణించారు. 

దేశంలో 33 వేల కేసులు..

నిన్న 33,750 మందికి కరోనా సోకినట్లు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో మహారాష్ట్రలో అత్యధిక కేసులు ఉన్నాయి. అక్కడ 11,877 మందిలో వైరస్ నిర్ధారణ అయింది. ఇక దేశంలో మొత్తం కేసులు 3.49 కోట్లకు చేరాయి. క్రియాశీల కేసులు 1,45,582కి ఎగబాకాయి. నిన్న 10వేల మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు 3.42 కోట్లుగా ఉన్నాయి. క్రియాశీల రేటు 0.42 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.20 శాతానికి పడిపోయింది. 24 గంటల వ్యవధిలో 123 మంది మరణించారు. ఇప్పటివరకు 4,81,893 మంది మహమ్మారికి బలయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని