Afghan Women: ఆ రోజుతో ‘ఆమె’ కలలన్నీ కుప్పకూలిపోయాయి..!

సాయంకాలం వేళ.. తన సోదరి ఇంట్లో సరదాగా గడిపేందుకు వెళ్తోంది జహ్రా. వెంట ఆమె తల్లి, ముగ్గురు తోబుట్టువులు కూడా ఉన్నారు.

Published : 15 Aug 2021 02:05 IST

తాలిబాన్లు తిరిగి రావడంతో మహిళల్లో ఆందోళన

కాబూల్‌: సాయంకాలం వేళ.. తన సోదరి ఇంట్లో సరదాగా గడిపేందుకు వెళ్తోంది జహ్రా. వెంట ఆమె తల్లి, ముగ్గురు తోబుట్టువులు కూడా ఉన్నారు. అలా వెళ్తున్న వారికి పెద్దపెద్దగా కేకలు వినిపించాయి. ఏంటా అని ఆరా తీయగా.. తాలిబాన్లు ఉన్నారంటూ వచ్చిన సమాధానంతో ఆమెకు భూమి కంపించినట్లైంది. మళ్లీ తాము ఆంక్షల సంకెళ్లలో బందీ అవుతున్నామనే భావన చుట్టుముట్టింది. అనుకున్నట్టే ఆ సాయంత్రం హెరాత్ నగరం వారి హస్తగతమైంది. దాంతో ఆ 26 ఏళ్ల యువతి జీవితం అంతా మారిపోయింది..!

అఫ్గానిస్థాన్‌లోని హెరాత్ ప్రాంతానికి చెందిన జహ్రా తాలిబాన్ ఛాయలు తగలకుండానే ఎదిగింది. తన భవిష్యత్తు గురించి కలలు కని.. వాటిని సాకారం చేసుకునే మార్గంలో స్వేచ్ఛగా పయనిస్తోంది. లాభాపేక్షలేని ఓ సంస్థ ద్వారా తన తోటి మహిళలకు లింగ సమానత్వం ఆవశ్యకతను వివరిస్తోంది. తాలిబాన్లు గురువారం సాయంత్రం ఆ నగరాన్ని ఆక్రమించడంతో ఆమె ఆశయాలకు ఆటంకం ఏర్పడింది. మిగతా కుటుంబాల మాదిరిగానే జహ్రా కుటుంబం ఇంటికే పరిమితమైంది. ‘ఇది నాకు షాకింగ్‌గా ఉంది. ఎంతో కష్టపడి విద్యనభ్యసించిన నేను.. నా కలలను సాకారం చేసుకుంటోన్న సమయంలో నన్ను నేను ఇంట్లో దాచుకొని ఉండటం ఎలా సాధ్యమవుతుంది?’ అంటూ ఆవేదనతో ప్రశ్నిస్తోంది. 

తాలిబాన్లు నెల క్రితమే హెరాత్‌ను సమీపించడంతో జహ్రా ఉద్యోగానికి వెళ్లడం మానేసింది. అప్పటి నుంచి ఇంటి నుంచే పనిచేస్తోంది. కానీ గురువారంతో ఆ అవకాశం కూడా పోయింది. ఆమె తిరిగి ఎప్పుడు ఉద్యోగానికి వెళ్తుందో తెలీక కన్నీటి పర్యంతమైంది. ఆమె 12 ఏళ్ల సోదరి బడికి వెళ్లడం కుదరదు. సోదరుడు ఫుట్‌బాల్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సి వచ్చింది. ఇక తాను గిటార్ వాయించడం గురించి ఆలోచించాలో వద్దో కూడా తెలీని పరిస్థితి. వారిది సంప్రదాయ, పురుషాధిక్య సమాజమే అయినప్పటికీ.. తాలిబాన్ల నుంచి బయటపడిన తర్వాత గత 20 ఏళ్లలో అక్కడి మహిళలు పలు విజయాలు సాధించారు. బడులు, ప్రభుత్వం, వ్యాపారం పార్లమెంట్‌లో వారికంటూ కాస్తో కూస్తో స్థానం లభించిందని జహ్రా తెలిపింది. ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందేమోనని అక్కడి మహిళల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. 

ఇళ్లు వదిలిపారిపోతున్న అఫ్గాన్లు..

ఇప్పటికే తాలిబాన్లు సగానికిపైగా దేశాన్ని హస్తగతం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. నెమ్మదిగా రాజధాని నగరం కాబూల్‌ను చుట్టుముడుతున్నారని తెలుస్తోంది. తాలిబాన్లు మునపటివలే కఠినంగా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారనే ఆందోళనలతో ఆ దేశ వాసులు ఇళ్లు వదిలిపారిపోతున్నారు. వారిలో 80 శాతం మంది మహిళలు, చిన్నారులే ఉంటున్నారు. ఈ విషయాన్ని యూఎన్ రిఫ్యూజీ ఏజెన్సీ వెల్లడించింది. ఇప్పటివరకు 2,50,000 మంది అఫ్గాన్లు ఇళ్లు వదిలిపారిపోయారని పేర్కొంది. 

గతంలో తాలిబాన్లు అధికారంలో ఉన్న సమయంలో బాలికల విద్య, మహిళలు పనిచేసే హక్కును నిషేధించింది. మగవారు తోడులేకుండా స్త్రీలు బయటకు వెళ్లకూడదని ఆంక్షలు పెట్టింది. బహిరంగంగా కఠిన శిక్షల్ని అమలుచేసింది. కొన్ని తప్పులకు రాళ్లతో కొట్టించడం, చేతులు నరకడం వంటి శిక్షల్ని అమలు చేసేది. అయితే ప్రస్తుతం తాలిబాన్‌ ఆక్రమణలో ఉన్నప్రాంతాల్లో అలాంటి శిక్షలు అమలు చేస్తున్నట్లు వెల్లడికాలేదు. 

మా గూడును కూల్చుతుంటే.. నిస్సహాయంగా నిలబడిపోయాం..

‘ఒక పక్షి తాను నివసించేందుకు ఒక గూడును నిర్మించాలనుకుంది. దాని కోసమే తన జీవితం, సమయం మొత్తం వెచ్చించింది. కానీ హఠాత్తుగా కొందరు వచ్చి దాన్ని కూల్చుతుంటే.. అడ్డుకోలేక, నిస్సహాయంగా నిల్చుండిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి అంతే’ అంటోంది హక్కుల కార్యకర్త జర్మినా కాకర్. ‘1996లో మొదటిసారి తాలిబాన్లు కాబూల్‌లోకి ప్రవేశించినప్పుడు నేను ఏడాది పాపను. నాకు ఐస్‌క్రీం కొనేందుకు మా అమ్మ బయటకు వెళ్లింది. ఒక రెండు నిమిషాల పాటు ముఖానికి పరదాను తొలగించినందుకు ఆమె కొరడా దెబ్బలు తినాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ తాలిబాన్లు అధికారంలోకి వస్తే.. మాకు అవే చీకటి రోజులు వస్తాయేమో’ అని జర్మినా ఆందోళన వ్యక్తం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని